Let's talk: editor@tmv.in
సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ

సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ

Gaddamidi Naveen
6 మే, 2026

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. మమతా బెనర్జీ మంగళవారం తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల అసలు తీర్పు కాదని, ఇది ఒక రాజకీయ కుట్ర ఫలితమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫలితాలపై తమ పోరాటం కేవలం రాజకీయ స్థాయిలోనే కాకుండా ప్రజా స్థాయిలో కూడా కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.

ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తుతూ..

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా మాట్లాడిన మమతా బెనర్జీ, తమ పార్టీ ప్రజల చేతిలో ఓడిపోలేదని, ఎన్నికల ప్రక్రియలో జరిగిన అనేక అవకతవకల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. “నా రాజీనామా ప్రశ్నే లేదు. మేము ప్రజల తీర్పుతో ఓడిపోలేదు. ఓట్లను దోచుకున్నారు. అప్పుడు నేను ఎందుకు రాజీనామా చేయాలి? అని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో తమ అసలు పోటీ బీజేపీతో కాదని, ఎన్నికల సంఘంతోనే జరిగిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని, తన రాజకీయ జీవితంలో ఇంత వివాదాస్పదమైన ఎన్నికలను తాను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక “నల్ల అధ్యాయం”గా నిలిచిపోతాయని,ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక విలన్‌గా వ్యవహరించారని కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియపైనా మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు 100 స్థానాలను అన్యాయంగా లాక్కున్నారని ఆమె వాపోయారు. లెక్కింపు ప్రక్రియను కావాలనే నెమ్మదింపజేసి తమ కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేంద్ర సంస్థలు, పరిపాలనా యంత్రాంగం, వివిధ అధికార సంస్థలు కలిసి పక్షపాత ధోరణితో వ్యవహరించాయని ఆమె పేర్కొన్నారు. దాడులు, అధికారుల బదిలీలు, పరిపాలనా ఒత్తిళ్లు ఎన్నికల సమాన అవకాశాలను దెబ్బతీశాయని అన్నారు.

294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని, టీఎంసీ 15 ఏళ్ల నిరంతర పాలనకు చరమగీతం పాడింది. అయితే, ఈ ఫలితాలను తాను అంగీకరించబోనని మమత అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాజ్యాంగబద్ధమైన మార్గాలు ఇంకా తమ ముందున్నాయని మమతా బెనర్జీ సూచించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అని ఆమె పేర్కొన్నప్పటికీ, ఆ చర్యల స్వరూపం ఏమిటన్న దానిపై మరింత వివరణ ఇవ్వలేదు.

ఎన్నికల ఫలితాల అనంతరం తన రాజకీయ వ్యూహంలో మార్పు వస్తుందని కూడా ఆమె సంకేతాలిచ్చారు. ఇకపై జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తానని తెలిపారు. ఇండియా' కూటమినిలోని పలువురు నాయకులు తనకు ఫోన్ చేసి సంఘీభావం వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని మమతా తెలిపారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్ వంటి పలువురు ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు అదే పార్టీతో సమన్వయం పెంచుకోవడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, త్రిపూర‌ వంటి రాష్ట్రాల్లో గతంలో రెండు పార్టీల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకున్నాయి.

మళ్ళీ 'స్ట్రీట్ ఫైటర్'గా ప్రజాక్షేత్రంలోకి..

తాను మళ్ళీ పోరాట రాజకీయాల్లోకి వస్తున్నానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఇంతకాలం ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా విషయాలు భరించాను. ఇప్పుడు నేను ఒక స్వతంత్ర పక్షిని, సామాన్య వ్యక్తిని. నేను ఒక వీధి పోరాట యోధురాలిని. మళ్ళీ రోడ్ల మీదకు వచ్చి అరాచకాలపై పోరాడుతాను అని ఆమె గంభీరంగా ప్రకటించారు. ఎన్నికల అనంతర హింసపై విచారణ జరిపేందుకు పది మంది సభ్యులతో కూడిన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 2021 ఎన్నికల తర్వాత జరిగిన హింసపై వచ్చిన ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా తోసిపుచ్చారు.

మొత్తానికి, బెంగాల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రభావం చూపాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా, మమతా బెనర్జీ మాత్రం రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తానని చెప్పడం మరింత ఉత్కంఠను రేపుతోంది.