
ఓటర్ల జాబితా సవరణపై ఎవరూ ఆందోళన చెందవద్దు: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలను బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేసిన ఆయన.. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు పేరును కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని శుక్రవారం భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్ ఉద్దేశం ఓటర్లను తొలగించడం కాదు. ఎన్నికల ప్రక్రియ కోసం ఒక పారదర్శకమైన కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం మాత్రమే. 2002 సంవత్సరం తర్వాత జన్మించి, ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేర్లు లేని వారందరినీ ఈ ప్రక్రియ ద్వారా చేర్చుతాము. వారి నివాసం, మూలాలు, ఇతర వివరాలకు సంబంధించిన కొత్త ఆధారాలను పరిశీలించి, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త జాబితాను రూపొందిస్తాం. సర్ యొక్క అసలు లక్ష్యం ఇదే. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్హులైన ప్రతి నిజమైన పౌరుడి పేరు ఇందులో ఉంటుందని స్పష్టం చేశారు.
అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు
ఇంతకుముందు గురువారం అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ వివాదాస్పద జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లాగే ఉందని, ముస్లింలపై వివక్ష చూపేందుకే దీనిని తీసుకొచ్చారని ఆరోపించారు. అయితే తాను ఎవరినీ భయపెట్టడం లేదని, కేవలం ప్రజల్లో అవగాహన కల్పించి వారు తగిన విధంగా సిద్ధమయ్యేలా చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశానని ఓవైసీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అస్సాం ఎన్‌ఆర్‌సీ అంశాన్ని ప్రస్తావిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. అస్సాంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సర్ ప్రక్రియలో దాదాపు 18 నుంచి 19 లక్షల మంది జాబితా నుంచి వెలుపల మిగిలిపోయారు. వారిలో ముస్లింలు కేవలం రెండు లక్షల మంది మాత్రమే కాగా, మిగిలిన వారంతా ఇతరులు. అయితే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తామని, ముస్లింలు మాత్రం ఫారినర్స్ ట్రిబ్యునల్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని హిమంత బిశ్వ స్వయంగా చెప్పారు. ఇది ముమ్మాటికీ వివక్షేఅని ఓవైసీ ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇస్తూ, ఈ ప్రక్రియ కేవలం చట్టబద్ధమైన ఓటర్ల నమోదు ప్రక్రియేనని, పారదర్శకమైన ఓటింగ్ కోసమేనని ప్రకాష్ రెడ్డి పునరుద్ఘాటించారు.
