Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదు.. ఆందోళన వద్దు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదు.. ఆందోళన వద్దు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
27 మే, 2026

ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా గుర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.

హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఎబోలా నివారణ చర్యలు, వైద్యశాఖ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్రత్యేకంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కఠిన నిఘా కొనసాగుతోందన్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తూ, డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్స్ సేవలను 24 గంటల పాటు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. అలాగే గాంధీ హాస్పిటల్ లో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమానితుల నమూనాలను పరీక్షల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కు పంపించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నాటికి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి 58 మంది హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, వారిలో ఎవరికి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. వారిని 21 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి జిల్లా నిఘా బృందాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.