
వాక్ స్వాతంత్య్రంపై రాజీ లేదు: కవిత
రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ నాయకులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత సోమవారం తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం కల్పించిన ‘వాక్ స్వాతంత్య్రాన్ని’ కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. తెలంగాణలోనే అత్యంత గౌరవనీయమైన మేధావుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు. దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన విశ్లేషణలు ఎప్పుడూ పార్టీల రంగులకు అతీతంగా ఉంటాయి. గతంలో నాపై ఆయన చేసిన వ్యాఖ్యానాలతో నేను కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను గౌరవించడం అత్యంత ముఖ్యం అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని కవిత ఆరోపించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన ఒత్తిడితో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అదే గనుక నిజమైతే దానిని తెలంగాణ మేధావులపై జరిగిన దాడిగా పరిగణిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నివాసాన్ని టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తాము ముట్టడిస్తామని కవిత స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమ పార్టీ ప్రొఫెసర్‌కు అండగా ఉంటుందన్నారు.
వివాదం నేపథ్యం ఏమిటి?
ఒక వార్తా ఛానల్ చర్చా వేదికలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాల్సిందిగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారని, అయితే అమిత్ షా అందుకు నిరాకరిస్తూ జగన్ తన పాత మిత్రుడని అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన శ్రేణులు నాగేశ్వర్‌పై పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
కేసులు ఉపసంహరించుకోవాలి: హరీష్ రావు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా, కక్షపూరితంగా కేసులు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆయనపై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
