Let's talk: editor@tmv.in
ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్’ బోర్డు.. సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్’ బోర్డు.. సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

Gaddamidi Naveen
4 జులై, 2026

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెరిగితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపించింది. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కాకినాడ జిల్లాలోనే ఈ పాఠశాల అత్యుత్తమ ర్యాంకులు సాధించింది. ఈ అద్భుత ప్రగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

పాఠశాల సాధించిన అద్భుత ఫలితాల కారణంగా ఈ ఏడాది చేరబోయే విద్యార్థుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిందని, దాంతో, గురువారం స్కూల్ యాజమాన్యం.. 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు సీట్లు భర్తీ అయ్యాయని, ఇకపై "నో అడ్మిషన్" అంటూ స్కూల్ ముందు ఒక బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరక్క నో అడ్మిషన్ బోర్డు పెట్టే స్థాయికి అది ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసల జల్లు కురిపించారు.

ఉపాధ్యాయుల వినూత్న బోధనా విధానాలు, బోధనేతర సిబ్బంది యొక్క నిరంతర సహకారం వల్లే ఈ అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని, మూలపేట ఉన్నత పాఠశాలను ఈ స్థాయికి తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా తదుపరి పిఠాపురం పర్యటనలో ఈ పాఠశాలను నేను స్వయంగా సందర్శిస్తాను అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా మూలపేట జెడ్పీ హైస్కూల్ సాధించిన విజయాలను, ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
PawanKalyanPithapuramMoolapetaZPHSGovernmentSchoolsEducationSchoolAdmissionsNoAdmissionAcademicExcellenceAndhraPradeshDeputyCM
ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్’ బోర్డు.. సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ - Tholi Paluku