
30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డు తరలింపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నిజాంపేట ప్రాంతంలో విద్యార్థులు, స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డిగ్రీ కళాశాల నూతన భవనం సమీపంలోని డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
డంపింగ్ యార్డు వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అక్కడ కొన్ని నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డును అత్యవసరంగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం రూ.20 కోట్ల వ్యయంతో ఆధునిక హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలో గురుకుల విద్యార్థులు అక్కడ నివసించనున్న నేపథ్యంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
కాలనీవాసులు తమ సమస్యలను వివరించిన సందర్భంగా మంత్రి స్పందిస్తూ, గతంలో చిన్నారిపై కుక్కల దాడి జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. డంపింగ్ యార్డు పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయన్న ప్రజల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. డీసీపీతో మాట్లాడి ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తామని చెప్పారు.
గతంలో డంపింగ్ యార్డు తరలింపుపై పలు ఫిర్యాదులు అందినప్పటికీ, ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ కారణంగా ఆలస్యమైందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అన్ని శాఖల సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకుని నెల రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదుల మేరకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించామని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి డంపింగ్ యార్డును త్వరితగతిన తరలిస్తామని వెల్లడించారు.
