
తెలంగాణ పర్యాటకానికి నీతి ఆయోగ్ గుర్తింపు
తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన “దివ్య భారత్” పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక వైవిధ్యానికి విశేష స్థానం దక్కడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక సంపదను, వైవిధ్యాన్ని నీతి ఆయోగ్ తన 'దివ్య భారత్' నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించిందని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ గుర్తింపు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నివేదికలో ప్రస్తావించిన అంశాలను మంత్రి వివరిస్తూ.. తెలంగాణలో సందర్శకులను ఆకట్టుకునే అనేక చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, చారిత్రాత్మక భువనగిరి కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భక్తిభావంతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, భద్రాచలం రామాలయం రాష్ట్ర ఆధ్యాత్మిక పర్యాటకానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంతల జలపాతం, ములుగు జిల్లాలోని బొగత జలపాతాలు పకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'సమ్మక్క-సారలమ్మ జాతర' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర కళలు తెలంగాణ పర్యాటకానికి అదనపు ఆకర్షణలు.
తెలంగాణ రాష్ట్రం తనదైన సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి అందాలతో పర్యాటకులకు సంపూర్ణ అనుభూతిని అందిస్తుందని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు. పర్యాటక మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ విదేశాల పర్యాటకులు తెలంగాణ అందాలను అన్వేషించాలని ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు.
దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదిక విడుదల చేయగా, 498 పేజీల్లో తెలంగాణకు 7 పేజీలు కేటాయించి అక్టోబర్-ఏప్రిల్ మధ్య సందర్శనకు అనుకూలమని సూచిస్తూ రాష్ట్రంలోని ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు సమ్మక్క-సారలమ్మ జాతర వంటి పండుగల వివరాలను పొందుపరిచింది.
