
పాలనలో నీతి ఆయోగ్ కీలక స్తంభం: ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశ పాలన వ్యవస్థలో నీతి ఆయోగ్‌ను ‘కీలక స్తంభం’గా అభివర్ణించారు. సంస్కరణలు, ఆవిష్కరణలు, సహకార సమాఖ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మోడీ పేర్కొన్నట్లుగా, నీతి ఆయోగ్ దేశంలో విధానాల రూపకల్పనను బలోపేతం చేయడంలోనే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా కీలకంగా పనిచేస్తోందన్నారు. దీన్ని ఆవిష్కరణలకు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు వేదికగా పేర్కొన్నారు. ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నీతి ఆయోగ్‌లో నియమితులైన సభ్యులకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా వైస్ చైర్మన్‌గా నియమితులైన అశోక్‌కుమార్ లాహిరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆయన ఆర్థిక, ప్రజా విధానాల్లో ఉన్న అనుభవం దేశ సంస్కరణల దిశను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా సభ్యులుగా నియమితులైన రాజీవ్‌గౌబ, కేవీ.రాజు, గోబర్ధన్ దాస్, అభయ్ కరందికర్, ఎం.శ్రీనివాసన్‌లకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీని కలిసిన నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్ అశోక్ లాహిరి
కొత్తగా నియమితులైన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ లాహిరి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. ఇదే సమయంలో, నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితులైన శాస్త్రవేత్త గోబర్ధన్‌దాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లాహిరిని ప్రభుత్వ థింక్‌ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఈ సంస్థకు ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న లాహిరి, గతంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవం కలిగినవారు. అలాగే 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు.
నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన లాహిరి, దేశంలోని సీనియర్ ఆర్థికవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. విధాన రంగంలో ఆయన విస్తృతంగా పనిచేశారు. ముఖ్యంగా ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూడా కీలక పాత్రలు పోషించారు.
లాహిరి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోల్‌కత్తాకు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కీలకంగా దోహదపడగల నాయకుడిగా భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఇక నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితులైన గోబర్ధన్ దాస్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. నేను పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో దళిత వర్గానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాను. ఈ బాధ్యత నాకు పదవి మాత్రమే కాదు, సాధారణ ప్రజల ఆశల ప్రతిబింబమని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలు, రైతులు, సాధారణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల అత్యంత అవసరమని తాను నమ్ముతున్నానని దాస్ చెప్పారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో నిబద్ధతతో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
