
మే 3 నుంచి బీహార్‌లో నిషాంత్ కుమార్ రాష్ట్రవ్యాప్త పర్యటన
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహా మంగళవారం కీలక ప్రకటన చేశారు. పార్టీ అధినేత నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ మే 3 నుంచి బీహార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. ‘సద్భావ్ యాత్ర’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవడం లక్ష్యమని కుష్వాహా చెప్పారు. మన నాయకుడు బీహార్ రాష్ట్రాన్ని కుటుంబంలా భావించినట్లే, నిషాంత్ కుమార్ కూడా అదే భావంతో రాష్ట్రం మొత్తం పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రలో సీనియర్ నేత శ్రవణ్ కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పంచాయతీ ప్రతినిధులు పాల్గొననున్నారు. యాత్రను పలు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ మే 3, 4 తేదీల్లో బగాహా నుంచి ప్రారంభమవుతుంది. రెండో దశ వైశాలి ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంపై పార్టీ కార్యకర్తల్లో భారీ ఉత్సాహం ఉందని కుష్వాహా తెలిపారు. ప్రజలతో సంబంధాలను పెంచడం, పార్టీకి బలాన్ని సమకూర్చడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జేడీయూ జాతీయ స్థాయిలో కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 22న నితీశ్ కుమార్ పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం, ఎంపీ సంజయ్ కుమార్ ఝాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించగా, మాజీ ఎంపీ చందేశ్వర్ ప్రసాద్ చంద్రవంశీను ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే అలోక్ కుమార్ సుమన్‌ను ఖజాంచీగా నియమించారు. జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలుగా పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ మార్పుల లక్ష్యమని జేడీయూ పేర్కొంది. అయితే పార్టీ పదవుల్లో నిషాంత్‌కుమార్‌కు ఎటువంటి పదవి దక్కలేదు.
