Let's talk: editor@tmv.in
నిరంజన్ మ‌ర‌ణం న‌న్ను కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నిరంజన్ మ‌ర‌ణం న‌న్ను కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నిరంజన్ మ‌ర‌ణం న‌న్ను కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
9 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని, అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ (17) బుధవారం వరంగల్‌లో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో, బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ పవన్ త‌న 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్‌ పెట్టారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచి వేసిందన్నారు.

పోస్ట్‌లో.. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.

నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయ‌న పేర్కొన్నారు.

వరంగల్ సమీపంలోని హనుమకొండలో నివసిస్తున్న నిరంజన్‌ను జూన్ 17న పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. జన్యు లోపం కారణంగా శారీరక ఎదుగుదల లోపించి, మంచానికే పరిమితమైన నిరంజన్ పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్.. అతడిని ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. నిరంజన్ తనను కలవాలనుకుంటున్న కోరికను తెలంగాణ జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్, అతని తల్లిదండ్రులను కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ‘కల్యాణ అక్షతలను’ అందజేశారు.

గతంలో నిరంజన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకు డాన్స్ చేసిన వీడియోలను పవన్ ఆసక్తిగా వీక్షించారు. అంతేకాకుండా, నిరంజన్ ఎంతో ఇష్టపడి కోరుకున్న ఒక చిన్న కుక్క పిల్లను (పప్పీ) కూడా పవన్ అతనికి బహుమతిగా అందించారు. అలాగే ‘ఓజీ 2’ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన కొద్ది రోజులకే ఆ యువకుడు మరణించడంతో జనసేన శ్రేణుల్లోనూ, నిరంజన్ కుటుంబంలోనూ తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు
PawanKalyanJanaSenaNiranjanRIPNiranjanTelanganaWarangalHanamkondaAndhraPradeshPawanKalyanFansGeneticDisorderRestInPeaceBreakingNews
నిరంజన్ మ‌ర‌ణం న‌న్ను కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ - Tholi Paluku