Let's talk: editor@tmv.in
భూగర్భ జలాల అధిక వినియోగంపై చర్యలు..ఎన్‌జీటీ కమిటీ ఏర్పాటు

భూగర్భ జలాల అధిక వినియోగంపై చర్యలు..ఎన్‌జీటీ కమిటీ ఏర్పాటు

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా భూగర్భ జలాల అధిక వినియోగం (ఓవర్-ఎక్స్‌ట్రాక్షన్) సమస్యను పరిష్కరించేందుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమర్థంగా అమలు కావడం లేదని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండో-గంగా నదీ పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల తగ్గుదలలో కీలక స్థాయిని దాటిపోయాయని, ఉత్తర-పశ్చిమ భారతదేశంలో 2025 నాటికి తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ 23న జారీ చేసిన ఉత్తర్వులో, జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భూగర్భ జలాల అక్రమ వినియోగాన్ని అరికట్టడంలో, అలాగే వాటి పునరుద్ధరణలో సరైన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది.

సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌‌ అథారిటీ (సీజీడబ్ల్యూఏ) సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎన్‌జీటీ, చాలా ప్రాంతాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ అవి కేవలం కాగితాలపైనే ఉన్నాయని వ్యాఖ్యానించింది. అక్రమంగా నీటిని తీసుకుంటున్న నిర్మాణాలపై పర్యావరణ పరిహారం విధించడంలో కూడా విఫలం అయ్యారని తెలిపింది. ఈ నేపథ్యంలో, సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్సిట్యూట్‌ ప్రతినిధి, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సభ్యుడు, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రతినిధి, ఐఐటీ రూర్కీ నిపుణుడు, అలాగే సీజీడబ్ల్యూఏ ప్రతినిధి ఉండనున్నారు. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించి, భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా తీవ్ర కొరత ఉన్న ప్రాంతాల్లో సంరక్షణ చర్యలు, పునరుద్ధరణ చర్యలపై సిఫార్సులు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 25కు ఎన్‌జీటీ వాయిదా వేసింది.