
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ భద్రతపై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక.. మంత్రి ఉత్తమ్‌కు అందజేత
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పటిష్టత, భూగర్భ పరిస్థితులపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) రూపొందించిన సమగ్ర సర్వే నివేదికను రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం జరిగిన ప్రాజెక్టు పురోగతి సమీక్షా సమావేశంలో ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త హెచ్.వి.ఎస్ సత్యనారాయణ ఈ నివేదికను మంత్రికి సమర్పించారు.
సాధారణ తనిఖీలకు సాధ్యం కాని లోపాలను గుర్తించేందుకు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు 'సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ' వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు. 2025 ఫిబ్రవరి 22న జరిగిన సొరంగం పైకప్పు కుప్పకూలిన ఘటనకు గల కారణాలను వివరిస్తూ.. ఒత్తిడి మండలాలు, నీటి ఊటలు పైకప్పు స్థిరత్వంపై కీలక అంశాలను నివేదికలో పొందుపరిచారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సొరంగం పనుల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చే యంత్రాలతో పాటు, దేశీయ ఏజెన్సీల నుంచి అవసరమైన పరికరాలను సమీకరించి పనులను వేగవంతం చేయాలని, నెలకు ఒక్కో వైపు నుంచి 200 మీటర్ల చొప్పున సొరంగం తవ్వకం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరావాస పనుల్లో భాగంగా జరుగుతున్న మట్టి అన్వేషణ పరిశోధనల్లో కూడా ఎన్‌జీఆర్‌ఐ చురుగ్గా పాల్గొనాలని మంత్రి కోరారు.
పనులు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 151.50 మీటర్ల పురోగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్లను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. నివేదికలోని సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
