Let's talk: editor@tmv.in
వచ్చే ఎన్నికలు ‘మావిగన్’ వర్సెస్ అమరావతి: వైఎస్ జగన్

వచ్చే ఎన్నికలు ‘మావిగన్’ వర్సెస్ అమరావతి: వైఎస్ జగన్

Gaddamidi Naveen
2 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ‘చట్టాల పాలన’ పక్కకుపోయి ‘భయానక పాలన’ నడుస్తోందని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ సామాజిక, రాజకీయ, పారిశ్రామిక అంశాలపై కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు.

రాజధాని అంశంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను జగన్ మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. నేను అమరావతి వెళ్తే.. జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో అక్కడ జరుగుతున్న భారీ అవినీతికి, స్కామ్‌లకు మాత్రమే వ్యతిరేకం. కాంట్రాక్టర్లకు విపరీతమైన రేట్లు కట్టబెడుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) వర్సెస్ అమరావతిగా జరగబోతున్నాయి. ప్రజా మద్దతు ఎవరికి ఉందో అప్పుడే తేలిపోతుందని సవాల్ విసిరారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో ఇదే తమ ప్రధాన నినాదమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి సహజసిద్ధమైన ప్రయోజనాలు, ఇప్పటికే సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు ఉన్నాయని, అవినీతి లేని రాజధానిగా ఇది అవతరిస్తుందని చెప్పారు. దీన్ని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో కూడా చేరుస్తామన్నారు.

‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’ శాంతిభద్రతల క్షీణత

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులకు ఆయుధంగా వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. "హే రామ్, సేవ్ ఆంధ్ర" అనే నినాదాన్ని ఇస్తూ, బాధితులనే నిందితులుగా మార్చే సరికొత్త ట్రెండ్‌ను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. రైతుల ఆవేదనను తెలుసుకోవడానికి, అమరావతి పేరిట జరుగుతున్న దుబారాను పరిశీలించడానికి తమ పార్టీ బృందం పెనుమాక వెళ్తుంటే.. ఉండవల్లి వద్ద టీడీపీ శ్రేణులు దాడి చేశాయన్నారు. దాడికి గురైంది తామైతే, ఉల్టా తమపైనే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ ఉదంతాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టాలని చూసిందని, తాను స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లాకే రిమాండ్ రిపోర్టులోని దారుణాలు బయటపడ్డాయన్నారు. సీసీటీవీ ఫుటేజీలను సైతం మాయం చేశారని ఆరోపించారు. అలాగే దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నా.. పోలీసులు ఆ కేసును నీరుగారుస్తున్నారని, కర్నూలు, తెనాలి, శ్రీకాకుళంలలో పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని, రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందని విమర్శించారు.

దళిత క్రైస్తవుల సమస్యపై టీడీపీ వైఖరి ఏంటి?

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ స్పష్టమైన వైఖరితో ఉందని, గతంలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని జగన్ గుర్తుచేశారు. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు కూడా తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా అందజేశామన్నారు. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి సామాజిక స్థితి మారదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కుల, మతాల పరంగా సమాజంలో విషం చిమ్ముతుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, దళిత క్రైస్తవుల అంశంపై టీడీపీ తన స్టాండ్‌ను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల సవరణ (స‌ర్) ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకపోతే.. అర్హులైనప్పటికీ వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేసే పన్నాగం ఇందులో ఉందన్నారు. అలాగే రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని మండిపడ్డారు. తాము తెచ్చిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారని, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు, మామిడి వంటి పంటల ధరలు పడిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా ఏలుతోందని, చివరకు మన సంస్కృతికి వ్యతిరేకంగా బీచ్ షాక్‌లను కూడా చంద్రబాబు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు.

85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు అన్యాయం

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే దాదాపు 85,000 మంది అల్పాదాయ మహిళా కార్మికుల (అక్కచెల్లెమ్మల) పొట్ట కొట్టేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.

‘స్మార్ట్ కిచెన్లు’ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి, గత 20 ఏళ్లుగా నమ్ముకుని పనిచేస్తున్న పేద మహిళలను తొలగించి, ఆ స్థానాల్లో తమ పార్టీ కార్యకర్తలను నింపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. గత రెండు నెలలుగా ఈ పేద కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి గౌరవ వేతనాన్ని రూ. 1,000 నుంచి రూ. 3,000 లకు పెంచామని, ఎన్నికల ముందు టీడీపీ ఇంకా ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు వారిని ఉద్యోగాల నుంచే తీసేయాలని చూడటం అత్యంత దుర్మార్గమని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
YSJaganYSRCPMAVIGUNAmaravatiAndhraPradeshAPPoliticsBreakingNewsTeluguNewsChandrababuNaiduPoliticsIndia
వచ్చే ఎన్నికలు ‘మావిగన్’ వర్సెస్ అమరావతి: వైఎస్ జగన్ - Tholi Paluku