Let's talk: editor@tmv.in
ఇంధన కొరత వార్తలు కేవలం పుకార్లే: మంత్రి కొలుసు పార్థసారథి

ఇంధన కొరత వార్తలు కేవలం పుకార్లే: మంత్రి కొలుసు పార్థసారథి

Dantu Vijaya Lakshmi Prasanna
30 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతోందని, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కారకంపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం దురదృష్టకరమని, ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించేందుకు కొన్ని రాజకీయ శక్తులు డీజిల్, పెట్రోల్ కొరతపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని చూడటం అనాగరికమని ఆయన విమర్శించారు.

ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై మంత్రి ఈ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని, కేవలం పుకార్ల వల్ల ప్రజలు 'పానిక్ పర్చేస్' (అవసరానికి మించి కొనుగోలు) చేయడం వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా ఒత్తిడి పెరిగిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిరోజూ ఇంధన లభ్యతపై సమీక్షిస్తున్నారని, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సరఫరాను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. స్టాక్ అవుట్ అయిన బంకుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, రానున్న రెండు మూడు రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఆక్వా రంగాలకు డీజిల్ కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మొక్కజొన్న రైతుల ఇబ్బందులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వారి నుంచి స్పందన రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలవడమే కాకుండా.. పొగాకు, కోకో, మామిడి వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర కల్పిస్తున్నామని వివరించారు.

రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనపై మాట్లాడుతూ, సాగునీటి, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులను కేటాయించి, పారదర్శకమైన టెండర్ల ద్వారా పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడటం ద్వారా రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, పెట్రోలు కొరతపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ప్రజలపై భారం పడకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలెవరూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నిరంతరం ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నవశకం మొదలైందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఇప్పటికే ముందుకు వచ్చాయని వెల్లడించారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజం 'గూగుల్' సైతం త్వరలోనే రాష్ట్రంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.9.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, ఇవి కార్యరూపం దాల్చితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరగా, చిత్తూరు జిల్లా వి.కోటలో జరిగిన జర్నలిస్టుపై దాడి ఘటనను మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై దాడులు సహించబోమని, బాధిత విలేకరి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇంధన కొరత వార్తలు కేవలం పుకార్లే: మంత్రి కొలుసు పార్థసారథి - Tholi Paluku