Let's talk: editor@tmv.in
న్యూజిల్యాండ్‌ మంత్రి తాజ్‌మహల్‌ సందర్శన

న్యూజిల్యాండ్‌ మంత్రి తాజ్‌మహల్‌ సందర్శన

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య,పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్‌ మెక్‌క్లే ఆదివారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్శన అనంతరం అక్కడి పరిపాలన, భద్రతా సిబ్బంది, టూర్ గైడ్ల సేవలను గోయల్ ప్రశంసించారు. మీడియాతో గోయల్ మాట్లాడుతూ న్యూజిలాండ్ మంత్రి, ఆయన భార్య భారతదేశానికి వచ్చి తాజ్‌మహల్‌ను సందర్శించాలని కోరుకున్నారు. వారు ఈ రోజు సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి తాజ్‌మహల్ ఎంతో నచ్చింది. ఇక్కడి పరిపాలన, భద్రతా సిబ్బంది, గైడ్లందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ సందర్శనలో గోయల్ తన భార్య సీమా గోయల్‌తో పాటు, టాడ్ మెక్‌క్లే తన భార్య నడీన్ మెక్‌క్లేతో కలిసి పాల్గొన్నారు. ఇక ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే భారత్–న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఏప్రిల్ 27న కుదురనుంది. ఈ ఒప్పందాన్ని రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో కీలక మైలురాయిగా గోయల్ అభివర్ణించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ భారత్–న్యూజిలాండ్ సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయం. ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గతంలో 2025 మార్చిలో ఈ ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభమై, అనేక దఫాల చర్చల తర్వాత 2025 డిసెంబర్‌లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు న్యూజిలాండ్ మార్కెట్‌లో ఎటువంటి సుంకాలు లేకుండా ఎగుమతి కానున్నాయ. సున్నితమైన రంగాలకు రక్షణ కల్పించనుంది. మొత్తంగా, తాజ్‌మహల్ సందర్శనతో పాటు రాబోయే ఎఫ్‌టీఏ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా మారనుంది.

భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై మెక్‌క్లే కీలక వ్యాఖ్యలు

న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్‌క్లే భారత్ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ న్యూజిలాండ్ ప్రభుత్వ తరఫున ప్రధాని నరేంద్రమోడీకి, అలాగే తన స్నేహితుడు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు కృతజ్ఞతలు తెలియజేశానని చెప్పారు.

న్యూజిలాండ్ పట్ల వారు చూపిన స్నేహం ఎంతో విలువైనది. రేపు న్యూఢిల్లీ లో మేము సంతకం చేయబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఒప్పందాల్లో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాదు, ఇది అత్యంత వేగంగా పూర్తయిన చర్చల్లో ఒకటని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలాంటి భావజాలం కలిగిన రెండు దేశాలు కలిసొస్తే, తమ ప్రజల కోసం గొప్ప ఫలితాలు సాధించగలమని ప్రపంచానికి చూపించామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్–న్యూజిలాండ్ మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు.