
ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ : మంత్రి మండిపల్లి రాంప్రసాద్
రాష్ట్రంలోని వాహనదారులకు వేగవంతమైన మరియు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై కేవలం 24 గంటల్లోనే పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు ఇతర జాప్యాల వల్ల వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ వినూత్న మార్పులు చేపట్టింది. కొత్త విధానం ప్రకారం డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సంబంధిత అధికారులు 24 గంటల లోపు దరఖాస్తును పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో ఆ రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ( ఆటోమేటిక్ ) ఆమోదం పొందినట్లుగా పరిగణించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
సెలవు దినాల్లోనూ సేవలు సిద్ధం
కేవలం పనిదినాల్లోనే కాకుండా సెలవు రోజుల్లో కూడా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ 24 గంటల నిబంధన కేవలం సాధారణ నంబర్లు పొందే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వాహనదారులు మాత్రం ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే వేచి ఉండాల్సి ఉంటుంది.
త్వరలోనే రాష్ట్రవ్యాప్త అమలు
రవాణా శాఖ రూపొందించిన ఈ నూతన విధానానికి ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపిందని అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లడం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా డిజిటల్ విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
