Let's talk: editor@tmv.in
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

Gaddamidi Naveen
20 మే, 2026

పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారికంగా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.

పేదల సొంతింటి కల సాకారం

తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ స్ఫూర్తితో నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తోందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. నాడు ఇందిరా గాంధీ ఇచ్చిన “గరీబీ హటావో” నినాదాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలో చూపిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, ఎలాంటి రాజకీయం లేకుండా కేవలం నిజమైన అర్హులకే ఈ ఇళ్లను అందిస్తున్నామని వెల్లడించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని విమర్శించారు. రాబోయే జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుందని మంత్రి అధికారికంగా ప్రకటించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నామని, ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ ఉచిత బియ్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా లబ్ధిదారులకు అర్హత లభిస్తుందని తెలిపారు. అలాగే, ప్రభుత్వ పెన్షన్ల కోసం ఎంతో మంది వృద్ధులు, వితాంతువులు ఎదురుచూస్తున్నారని.. వారి కష్టాలను తీరుస్తూ జూన్ 2 నుంచే కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. భానూరు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య నివారణకు కొన్ని చిన్న రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శితో మాట్లాడినందున త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.

గతంలో ఇందిరా గాంధీ మెదక్ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి విశాఖ ఫ్యాక్టరీతో పాటు అనేక ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడే స్థాపించారని గుర్తుచేశారు. ఆ నాడు కాకా వెంకటస్వామి, టి. అంజయ్య వంటి అగ్ర నాయకులు ఐఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేసి కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టి. అంజయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించి, ఆయన దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.