Let's talk: editor@tmv.in
ప్రజా పక్షాన పోరాడేందుకే కొత్త పార్టీ: కవిత

ప్రజా పక్షాన పోరాడేందుకే కొత్త పార్టీ: కవిత

Gaddamidi Naveen
22 ఏప్రిల్, 2026

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. వెయ్యేళ్లయినా బీఆర్ఎస్ పార్టీ మారదని, ఆ పార్టీ పంథాలోనే కాంగ్రెస్ కూడా వెళ్తోందని ఆమె విమర్శించారు. ఈ నెల 25న తాము ఒక నూతన రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రాబోతున్నట్లు ఆమె ప్రకటించారు.

బీఆర్ఎస్ తీరుపై విమర్శలు

జగిత్యాల సభలో 75 ఏళ్ల వయసున్న జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని, ఆయనను నవ యువకుడిగా అభివర్ణించడాన్ని కవిత తప్పుబట్టారు. 75 ఏళ్ల వ్యక్తి యువకుడైతే, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, వైఎస్సార్ అండతో గతంలో రెండుసార్లు తెలంగాణ ఉద్యమ నాయకత్వంపైనే పోటీ చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికీ తన ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలనే తప్పుపడుతూ చులకనగా మాట్లాడుతోందని మండిపడ్డారు.

జగిత్యాల సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె నిలదీశారు. మహిళా బిల్లు వీగిపోయినా, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి అంశాలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ గౌరవం ఉండదని ఆమె ఆరోపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను 'గుంటనక్కలు' అని విమర్శిస్తూనే, మరోవైపు ఢిల్లీలో వారితో డీల్స్ మాట్లాడుకుంటున్నారని క‌విత‌ ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని కవిత విమర్శించారు. సీజన్ ముగిసినా సగం మందికి కూడా రైతు భరోసా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. కాళేశ్వరం కేసులో ఫలానా తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం కోర్టులను ప్రభావితం చేయడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఢిల్లీలో జరిగిన రాజకీయ భేటీలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తామనడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అన్నారు. ఎవరు అధికారంలో ఉండాలో, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

నూతన రాజకీయ శక్తి

ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజా సెంట్రిక్ గా కాకుండా పార్టీ సెంట్రిక్ గా పనిచేస్తున్నాయని, అందుకే తాము ఈ నెల 25న కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. సిరిసిల్ల నుంచి తమ పార్టీ ఆవిర్భావ సభకు కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరారని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి ఆటంకాలు సృష్టించవద్దని ఆమె పోలీసులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఒక ఆడబిడ్డగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.