
నేతాజీని 'జాతీయ పుత్రుడు'గా ప్రకటించలేం: సుప్రీంకోర్టు
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను 'జాతీయ పుత్రుడు'గా ప్రకటించాలని, ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ వల్లే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని, ఇవి పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించినవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిస్తూ.. పిటిషనర్ ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రచార యావపై ధర్మాసనం ఆగ్రహం
నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించడంతో పాటు, ఐఎన్ఏ స్థాపక రోజైన అక్టోబర్ 21 (1943)ను, ఆయన జయంతి రోజైన జనవరి 23ను జాతీయ దినోత్సవాలుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అయితే గతంలోనే ఇటువంటి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. "ఇవే అంశాలపై మీరు ఇదివరకే పిటిషన్ వేశారు, దాన్ని మేము తిరస్కరించాం. ఇలాంటి విషయాలను ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పాం. అయినప్పటికీ మళ్లీ అదే పిటిషన్ వేయడం కేవలం ప్రచారం కోసమేనని అర్థమవుతోంది" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
జరిమానా తప్పదు
కోర్టు సమయాన్ని వృథా చేస్తూ పదే పదే ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయడంపై సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్‌ను హెచ్చరించారు. "ఇక్కడి నుంచి వెళ్ళండి.. లేదంటే భారీ జరిమానా విధించాల్సి ఉంటుంది" అని ఘాటుగా స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ పిటిషనర్ నుంచి ఇటువంటి అంశాలపై వచ్చే పీఐఎల్‌లను స్వీకరించవద్దని కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టును అపహాస్యం చేయవద్దని చురకలు అంటించింది.
గతంలోనూ తిరస్కరణ
2022లో కూడా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అప్పటి సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి ఆయనలా కష్టపడి పని చేయడమేనని, సెలవు కోరడం కాదని ఆనాడు కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు అధికార పరిధిని గుర్తించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అప్పట్లోనే న్యాయస్థానం స్పష్టం చేసినా, మళ్లీ అవే అభ్యర్థనలతో కోర్టు ముందుకు రావడం గమనార్హం.
నిర్ణయం ప్రభుత్వానిదే..
దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నేతాజీ పాత్ర, ఆయన సైన్యం చేసిన కృషి ఎనలేనిదని, కానీ ఒక వ్యక్తికి హోదా కల్పించడం, జాతీయ దినోత్సవాలను నిర్ణయించడం అనేది పాలనాపరమైన నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి విన్నపాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకే విన్నవించుకోవాలని సూచించింది. కేవలం వార్తల్లో నిలవడానికి న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది.
