Let's talk: editor@tmv.in
నేపాల్ హోం మంత్రి సుధన్ గురుంగ్ రాజీనామా

నేపాల్ హోం మంత్రి సుధన్ గురుంగ్ రాజీనామా

Shaik Mohammad Shaffee
23 ఏప్రిల్, 2026

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యాపారవేత్తతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే విమర్శలు రావడంతో, ఆ దేశ హోం మంత్రి సుధన్ గురుంగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. యువత చేపట్టిన 'జెన్-జీ' ఉద్యమం ద్వారా గుర్తింపు పొంది, గోర్ఖా నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, ప్రధాని బాలేంద్ర షా కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుత వివాదంపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించారు.

వివాదానికి కారణమిదే..

మనీలాండరింగ్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ భట్‌కు చెందిన కంపెనీల్లో సుధన్ గురుంగ్‌కు వాటాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'స్టార్ మైక్రో ఇన్సూరెన్స్', 'లిబర్టీ మైక్రో ఇన్సూరెన్స్' అనే సంస్థల్లో సుధన్ పేరిట షేర్లు ఉన్నట్లు ఆదివారం బయటకు వచ్చిన పత్రాలు ధ్రువీకరించాయి. ఈ కంపెనీలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండటంతో, హోం మంత్రి హోదాలో ఆయన ఆ విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ విపక్షాలతో పాటు సొంత పార్టీ (ఆర్‌ఎస్‌పీ) నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.

పదవి కంటే నైతికతే ముఖ్యం

తన రాజీనామాపై సుధన్ గురుంగ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత ప్రకటన చేశారు. "నాకు పదవి కంటే నైతికతే ముఖ్యం, ప్రజల నమ్మకం కంటే మించిన శక్తి ఏదీ లేదు. 46 మంది సోదర సోదరీమణుల రక్తం, త్యాగాల మీద ఏర్పడిన ఈ ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు.. నైతికతతోనే సమాధానం చెప్పాలి. విచారణ పారదర్శకంగా సాగాలని, ప్రయోజనాల సంఘర్షణ తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక వివరాలపై గందరగోళం

తనపై వస్తున్న ఆరోపణలను సుధన్ తోసిపుచ్చారు. స్టాక్ మార్కెట్‌లో తనకు రూ.2.74 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయని, అందులో రూ.25 లక్షల విలువైన షేర్లను దాచాల్సిన అవసరం లేదని గతంలోనే వివరణ ఇచ్చారు. అయితే ఆయన సమర్పించిన ఆస్తుల ప్రకటనలో ఈ షేర్ల వివరాలను విడిగా చూపకపోవడం, ఇంకా మార్కెట్లోకి రాని కంపెనీల షేర్లను ట్రేడెడ్ షేర్లుగా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఈ షేర్ల కొనుగోలుకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల వివరాలను కూడా ఆయన వెల్లడించలేదని సమాచారం.

ప్రక్షాళన బాటలో ప్రధాని బాలెన్

అినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం, ఇప్పటికే క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై ఏప్రిల్ 9న కార్మిక శాఖ మంత్రి దీపక్ కుమార్ షాను తొలగించింది. తాజాగా హోం మంత్రి కూడా తప్పుకోవడంతో నేపాల్ రాజకీయాల్లో పారదర్శకతపై చర్చ మొదలైంది. రాజీనామా అనంతరం సుధన్ స్పందిస్తూ.. "నేను నైతిక బాధ్యత నెరవేర్చాను. మార్పు కోరుకునే వారు నిజాయితీగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థల 'స్వీట్ షేర్ల' బాగోతం కూడా త్వరలోనే బయటపడుతుంది" అంటూ వ్యాఖ్యానించడం విశేషం.