
ఎన్డీయే విజయాలు మోడీ నాయకత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం:సీఎం చంద్రబాబు నాయుడు
పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి సాధించిన ఘనవిజయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదృఢ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ప్రజలు ఎన్‌డీఏకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్,అస్సాంలో ప్రభంజనం
సోమవారం మధ్యాహ్నం వరకు అందిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌డీఏ కూటమి ఏకంగా 152 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అటు అస్సాంలో అదే స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పట్టు నిలుపుకుంది. ఈ ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే సిద్ధాంతానికి ప్రజలు పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి, విశ్వసనీయతను కోరుకుంటున్న "యంగ్ ఇండియా" ఆశయాలకు ఈ గెలుపు ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ సహా పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.
మార్పును కోరుకుంటున్న ప్రజలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల్లోని మార్పు కాంక్షను స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రదర్శించిన పోరాట పటిమను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "డబుల్ ఇంజన్ సర్కార్" ద్వారానే భద్రత, అభివృద్ధి సాధ్యమని దేశం నమ్ముతోందని పవన్ పేర్కొన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, బెంగాల్ నాయకుడు సువేందు అధికారితో పాటు ఇతర అగ్రనేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు, కేరళలో కూడా కొత్త రాజకీయ శక్తులు ఉద్భవిస్తున్నాయని, ఇది భవిష్యత్ మార్పుకు సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి, స్థిరత్వానికి పట్టం: ఐటీ మంత్రి నారా లోకేష్
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఎన్‌డీఏ విజయాన్ని స్వాగతించారు. అభివృద్ధి, స్థిరమైన పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ అద్భుతమైన ఎన్నికల అరంగేట్రం చేయడం విశేషమని ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని లోకేష్ పేర్కొన్నారు. పారదర్శకత, వేగవంతమైన పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు సమగ్ర పురోగతికి బాటలు వేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
