Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఎన్డీఏ ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఎన్డీఏ ర్యాలీ

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరం అని ఆయన అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం నిర్వహించిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భారీ నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి సుదీర్ఘకాల కల సాకారం అవుతుందని దేశమంతా ఆశగా ఎదురుచూసిందని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు రాజకీయ స్వార్థంతో ఈ బిల్లును అడ్డుకున్నాయని ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక 'బ్లాక్ డే' అని ఆయన విమర్శించారు. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళా ప్రజాప్రతినిధులను చూస్తామని ఆశించిన కోట్లాది మంది మహిళల ఆత్మాభిమానాన్ని ప్రతిపక్షాలు దెబ్బతీశాయి. ఇది కేవలం రాజకీయ విఫలం కాదు దేశానికి చేసిన ద్రోహం అని ఆయన మండిపడ్డారు.

పురుషాధిక్య భావజాలంపై విమర్శలు

మహిళలు అన్ని రంగాల్లో ఎదగడాన్ని సహించలేని మనస్తత్వం కొన్ని పార్టీల్లో కనిపిస్తోందని ఇది పురుషాధిక్య భావజాలానికి నిదర్శనమని ముఖ్యమంత్రి విమర్శించారు. మహిళలను గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది కానీ ప్రతిపక్షాల తీరు ఆ విలువలను మంటగలిపింది అని మహిళా లోకమంతా ఏకమై ఈ అన్యాయంపై గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ప్రధాని హామీ

లోక్‌సభ స్థానాల పెంపు (డీలిమిటేషన్) విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి అన్యాయం జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. లోక్‌సభ స్థానాలు 50 శాతం పెరిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు.

ప్రజలే గుణపాఠం చెప్పాలి

మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీలను రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో తిరస్కరించాలని చంద్రబాబు కోరారు. ఈ అంశంపై ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పిస్తామని మహిళా సాధికారత కోసం తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని ప్రతిపక్షాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఎన్డీఏ ర్యాలీ - Tholi Paluku