Let's talk: editor@tmv.in
కొల్హాపూర్ లైంగిక దోపిడీ కేసులో నివేదిక ఇవ్వండి: ఎన్‌సీడబ్ల్యూ

కొల్హాపూర్ లైంగిక దోపిడీ కేసులో నివేదిక ఇవ్వండి: ఎన్‌సీడబ్ల్యూ

Pinjari Chand
30 ఏప్రిల్, 2026

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మహిళలు, మైనర్ బాలికలపై పెద్ద ఎత్తున లైంగిక దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలపై వచ్చిన నివేదికను నేషనల్‌ కమిషన్‌ ఫర్‌‌ ఉమెన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) బుధవారం సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై 7 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించింది. ఈ కేసు ఒక 22 ఏళ్ల యువకుడి అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. అతడు ‘అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను’ అంటూ ఒక యువతిని బెదిరించి శారీరక సంబంధానికి బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్‌‌, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత, ప్రోటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్స్‌ యాక్ట్‌ (పోక్సో), ఇన్‌ఫార్మేషన్‌ టెక్నాలజీ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.

అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించండి

బాధితులందరినీ గుర్తించి, నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని కూడా అరెస్టు చేయాలని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న అభ్యంతరకర కంటెంట్ మొత్తాన్ని తొలగించాలని, సమగ్ర సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టాలని కమిషన్ ఆదేశించింది. అలాగే బాధితుల భద్రత, కౌన్సెలింగ్, వైద్య సహాయం, పునరావాసం వంటి అంశాలపై తీసుకున్న చర్యల వివరాలను కూడా సమర్పించాలని కోరింది. భవిష్యత్తులో ఇలాంటి దోపిడీ, బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని సూచించింది.

ఎన్‌సీడబ్ల్యూ ఎక్స్‌ వేదికపై తెలిపిన ప్రకటనలో కొల్హాపూర్‌లో మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దోపిడీపై వచ్చిన నివేదిక అత్యంత ఆందోళనకరమైనదని పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా మహిళలు, బాలికలను ప్రలోభపెట్టి, వారిని లైంగికంగా దోపిడీ చేసి, అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగిస్తున్నారని, ఇది ఒక విస్తృత నేర నెట్‌వర్క్‌కు సూచన కావచ్చని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఘటనను ఎన్‌సీడబ్ల్యూ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు మహిళలు, కుటుంబాల్లో తీవ్ర శారీరక, మానసిక క్షోభను కలిగించడమే కాకుండా భయం, అభద్రతను పెంచుతాయని పేర్కొంది. అలాగే డిజిటల్ భద్రత, సైబర్ పర్యవేక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

కొల్హాపూర్ లైంగిక దోపిడీ కేసులో నివేదిక ఇవ్వండి: ఎన్‌సీడబ్ల్యూ - Tholi Paluku