
దేశవ్యాప్త వడగాల్పులు ...కేంద్ర కార్మిక శాఖ కీలక మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో, కార్మికులు, శ్రామికుల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఆరుబయట, కఠినమైన శారీరక శ్రమ చేసే రంగాలలో పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకుని, తక్షణ నివారణ, ఉపశమన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను మంత్రిత్వ శాఖ కోరింది. కార్మికుల భద్రతను నిర్ధారించడానికి బహుళ-రంగాల సమన్వయంతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పనివేళల మార్పు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్రమైన ఎండలు ఉన్న సమయంలో కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పనివేళలను రీ-షెడ్యూల్ చేయాలని యజమానులకు సూచించింది. పని ప్రదేశాలలో తగినంత తాగునీటి సౌకర్యం, విశ్రాంతి గదులు, చల్లదనాన్ని ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా నిర్మాణ రంగం వంటి కష్టతరమైన పనుల వద్ద అత్యవసర ఐస్ ప్యాక్‌లు, వడదెబ్బ నివారణ సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, కార్మికులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది.
పరిశ్రమలు, గనులు, నిర్మాణ సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. పని ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పని వేగంలో వెసులుబాటు కల్పించాలని, నిరంతర పని అవసరమైన చోట ఇద్దరు వ్యక్తులతో కూడిన బృందాలను కేటాయించాలని తెలిపింది. గాలి వెలుతురు, సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు, నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీల కార్మికులు, రోజువారీ కూలీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది. లేబర్ చౌక్‌లు, బహిరంగ ప్రదేశాలలో వడగాల్పుల ప్రభావంపై అవగాహన పోస్టర్లు, బ్యానర్లు, అత్యవసర సంప్రదింపు వివరాలను ప్రదర్శించాలని సూచించింది.
కార్మికులలో చైతన్యం కల్పించేందుకు నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో వడగాల్పుల కారణాలు, వాటి ప్రభావం, సరైన పని పద్ధతులు, డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలను ముందుగానే గుర్తించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా, పని ప్రదేశంలో, సమాజ స్థాయిలో అనుసరించాల్సిన నివారణ వ్యూహాలు, అత్యవసర ప్రథమ చికిత్స చర్యలపై కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఆరోగ్య సేవల పరంగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో వడదెబ్బ కేసుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిలో తగినంత ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐస్ ప్యాక్‌లు, ఇతర నివారణ మందులను నిల్వ ఉంచాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలైన ఈపీఎఫ్ఓ, నేషనల్ కెరీర్ సర్వీస్ నిర్వహించే శిబిరాల్లో కూడా చల్లదనం, తాగునీటి సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ భద్రతా చర్యల అమలును పర్యవేక్షించే బాధ్యతను చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వంటి సంస్థలకు అప్పగించారు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం సురక్షితమైన పని పరిస్థితులు, తాగునీరు, ఆరోగ్య తనిఖీలు జరుగుతున్నాయో లేదో వీరు తనిఖీ చేస్తారు. తీసుకున్న చర్యలపై ప్రతి పక్షం రోజులకు ఒకసారి నివేదికలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ అన్ని సంస్థలను కోరింది. వేసవి కాలంలో కార్మికుల ఆరోగ్యం, భద్రత, ఉత్పాదకతను కాపాడటానికి సమయానుకూల చర్యలు, నిరంతర పర్యవేక్షణ అత్యవసరమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
