
జాతీయ భద్రతకు ప్రజల సంకల్పబలం కూడా అవసరం: అజిత్ దోవల్
జాతీయ భద్రతను కేవలం సైనిక శక్తితో మాత్రమే అంచనా వేయడం సరైంది కాదని, ప్రజల సంకల్పబలం కూడా అంతే ముఖ్యమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కూడా హాజరయ్యారు.
జాతీయ భద్రత అనేది బహుముఖ అంశం
జాతీయ భద్రత అనేది విస్తృతమైన, సంక్లిష్టమైన అంశమని దోవల్ పేర్కొన్నారు. ఒక దేశ భద్రతలో సైనిక శక్తి, సాంకేతిక సామర్థ్యం, సహజ వనరులు, దౌత్య బలం, మానవ వనరులు అన్నీ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అయితే ఒక దేశ శక్తిని అంచనా వేస్తున్నప్పుడు ప్రజల సంకల్పబలాన్ని పట్టించుకోకపోవడం పెద్ద తప్పు అవుతుందని ఆయన చెప్పారు.
ప్రపంచ ఉదాహరణలు
ఈ విషయాన్ని వివరించేందుకు దోవల్ కొన్ని అంతర్జాతీయ ఉదాహరణలను ప్రస్తావించారు. మాజీ సోవియట్ యూనియన్ ఆఫ్ఘానిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడం, అమెరికా వియత్నాం యుద్ధంలో వెనక్కి తగ్గడం వంటి సంఘటనలు సైనిక శక్తి లోపం వల్ల కాదని అన్నారు. స్థానిక ప్రజల సంకల్పబలం కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు.
ప్రజల పాత్ర కీలకం
జాతీయ భద్రతలో ప్రజల అవగాహన, వారి భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని దోవల్ అన్నారు. భద్రత అనేది కేవలం సైన్యం, పోలీసు లేదా గూఢచారి సంస్థల బాధ్యత మాత్రమే కాదని, మొత్తం దేశం కలిసి బాధ్యత వహించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు. భద్రతా రంగంలో పనిచేయాలనుకునే యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రంగంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, మానసిక బలం, జట్టు భావన అత్యంత అవసరమని చెప్పారు. ఇది వెండి పతకాల ఆట కాదు. మీరు గెలిస్తే చరిత్ర సృష్టిస్తారు. ఓడిపోతే మీరు చరిత్రలో భాగమవుతారని ఆయన వ్యాఖ్యానించారు.
గౌరవ డాక్టరేట్
ఈ కార్యక్రమంలో దోవల్‌కు జాతీయ భద్రత రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ దోవల్ వినమ్రంగా స్వీకరించారు.
