
నేషనల్ హెరాల్డ్ కేసు: నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (నేడు) సోమవారం విచారించనుంది.
ఈ కేసు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అంతకుముందు, డిసెంబర్ 22న హైకోర్టు గాంధీ కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే డిసెంబర్ 16, 2025న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ ఈడీ దాఖలు చేసిన అప్లికేషన్‌పైనా నోటీసులు ఇచ్చింది. ట్రయల్ కోర్టు తన తీర్పులో, ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును చట్టపరంగా అనుమతించలేనిదిగా పేర్కొంది. కారణం, ఈ విచారణకు సంబంధించిన ఆధారమైన ఎఫ్‌ఐఆర్ లేకపోవడమే అని చెప్పింది.
ఈ కేసులో గాంధీ కుటుంబంతో పాటు సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ సంస్థ, డోటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ భండారి వంటి వారికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఈడీ ఆరోపణల ప్రకారం, గాంధీ కుటుంబ సభ్యులు, అలాగే మరణించిన కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్ తదితరులు కలిసి కుట్రపూరితంగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది.
కేసు నేపథ్యం, ఆరోపణలు
ఈ కేసులో ప్రధానంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తుల వ్యవహారం ఉంది. ఈ సంస్థ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను ప్రచురిస్తుంది. సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కుట్రపూరితంగా, మనీలాండరింగ్ ద్వారా స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. 'యంగ్ ఇండియన్' సంస్థలో సోనియా, రాహుల్ గాంధీలకు 76 శాతం మెజారిటీ వాటాలు ఉన్నాయని, కేవలం రూ.90 కోట్ల రుణాన్ని సాకుగా చూపి ఏజేఎల్ ఆస్తులను ఈ సంస్థ అక్రమంగా చేజిక్కించుకుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
సొలిసిటర్ జనరల్ వాదన
ఫిబ్రవరి 19న జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రధానంగా చట్టపరమైన అంశం అని ఆయన పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన కారణాలు స్పష్టంగా తప్పుగా ఉన్నాయని, అవి ఇతర కేసులపై కూడా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ కేసును వాస్తవాల ఆధారంగా కాకుండా చట్టపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ కొనసాగాలంటే, సంబంధిత షెడ్యూల్ నేరానికి ముందు ఎఫ్‌ఐఆర్ నమోదు కావాల్సిందే. ఈ కేసులో విచారణ ఒక వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైందని, అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిపింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2014లో ఫిర్యాదు చేసినప్పటికీ, సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు గుర్తు చేసింది.
అయితే ఈడీ తన పిటిషన్‌లో ట్రయల్ కోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. ఒక వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా వచ్చిన కేసులను తిరస్కరించడం వల్ల మనీలాండరింగ్‌కు పాల్పడే వ్యక్తులకు ఇది సడలింపుగా మారుతుందని పేర్కొంది. ఈ కేసులో ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వాటిని తేలికగా తీసుకోవడం సరికాదని వాదించింది.
అదనంగా, ఒక న్యాయస్థానం వ్యక్తిగత ఫిర్యాదుపై స్వీకరించిన కేసు, సాధారణ ఎఫ్‌ఐఆర్ కంటే మరింత బలమైనదని ఈడీ పేర్కొంది. పోలీసుల దర్యాప్తులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా కోర్టు స్వీకరించకపోవచ్చు, కానీ వ్యక్తిగత ఫిర్యాదు ద్వారా వచ్చిన కేసులో కోర్టు ఇప్పటికే గమనించిన అంశాలు ఉంటాయని వివరించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విచారణ దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.
