
ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన నారాయణపేట జిల్లా కలెక్టర్
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్ర సమీపంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉట్కూర్ సమీపంలోని ఫీడర్ చానెల్ పనుల వద్దకు వెళ్లిన కలెక్టర్, అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలతో నేరుగా మాట్లాడారు.
ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలు ఉదయం 5:30 గంటలకే పనికి రావాలని, ఎండ తీవ్రత పెరిగేలోపు పని పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లవచ్చని ఆమె సూచించారు. రోజుకు ఎంత కూలీ లభిస్తుందో కూలీలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని, కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ, వారు తరచూ తాగునీరు తీసుకునేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు.
కూలీల సంఖ్య పెంచాలని ఆదేశం
ఉట్కూర్ పెద్ద గ్రామ పంచాయతీ అయినందున, ఇక్కడ ఉపాధి హామీ పనుల్లో కనీసం 150 మంది కూలీలైనా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలంలోని వల్లంపల్లి, బిజ్వార్, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో కూలీల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో కూలీల సంఖ్య పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓకు సూచించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, కూలీల సంఖ్యకు సంబంధించిన రోజువారీ నివేదికను తప్పనిసరిగా తనకు పంపించాలని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారి వెంకట్ రాములును కలెక్టర్ ఆదేశించారు.
