
పెట్టుబడులే లక్ష్యంగా రేపు నారా లోకేష్ రష్యా పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జూన్ రేపటి నుంచి 7వ తేదీ వరకు ఆయన రష్యాలో పర్యటించనున్నారు. నవ్యాంధ్రను పారిశ్రామికంగా సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనలో భాగంగా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో నిర్వహించనున్న అత్యంత ప్రతిష్ఠాత్మక 'సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్' (ఎస్పీఐ ఈఎఫ్ 2026) సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వ్యాపార పెట్టుబడుల సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ విధాన విదివిదానాలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఆరు రోజుల ఈ రష్యా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలువురు గ్లోబల్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ దిగ్గజాలతో వరుసగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అంతర్జాతీయ గమ్యస్థానంగా ప్రపంచ వేదికపై ప్రదర్శించడం వివిధ రంగాల్లో సరికొత్త ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన చర్చలు జరపనున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో కల్పించబోయే మౌలిక వసతులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక రంగాలతో పాటు ఇతర కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలను మంత్రి ప్రపంచ ప్రతినిధులకు వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను పారిశ్రామిక అభివృద్ధికి అనుసరిస్తున్న సరికొత్త ప్రణాళికలను ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ వేదిక ముందుకు తీసుకెళ్లనున్నారు.
