Let's talk: editor@tmv.in
అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం

Panthagani Anusha
20 ఏప్రిల్, 2026

శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పేదవాడి ఆకలి తీరుస్తున్న 'అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా ఆమె 76 లక్షల రూపాయల చెక్కును శనివారం అధికారులకు అందజేశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్న క్యాంటీన్ల సీఈవోకు విరాళానికి సంబంధించిన పత్రాలను ఆమె స్వయంగా అప్పగించారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కేవలం భోజనశాలలు మాత్రమే కావని ఆకలి తీర్చే అమ్మ ప్రేమను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. నిరుపేదలు, కూలీలు, సామాన్యుల ఆకలి తీర్చాలనే ఉన్నత లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పథకం వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోందని ఆమె కొనియాడారు. కష్టాల్లో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే మిన్నైన సేవ మరొకటి లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20వ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో లబ్ధిదారులందరికీ పూర్తి ఉచితంగా భోజన సదుపాయం కల్పించాలని భువనేశ్వరి సూచించారు. తాను అందించిన రూ.76 లక్షల విరాళాన్ని ఆ రోజున నిర్వహించే ఉచిత భోజన కార్యక్రమాలకు క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించాలని ఆమె కోరారు.