
నందివాడ పీఏసీఎస్‌లో రూ. 2.19 కోట్ల భారీ స్కాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణా జిల్లా నందివాడ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) లో వెలుగుచూసిన రూ. 2.19 కోట్ల భారీ కుంభకోణంపై గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ స్కాం మరువక ముందే మరో విడతగా రైతుల సొమ్ము పక్కదారి పట్టడంపై ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ప్రజావేదిక కార్యాలయంలో సహకార శాఖ సూపరింటెండెంట్ హరినాథ్ బాబు, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. రైతులు చెల్లించిన నగదును సొసైటీ ఖాతాలో జమ చేయకుండా, పీఏసీఎస్ కార్యదర్శి హరీశ్ ప్రసాద్ స్వంతానికి వాడుకుని దుర్వినియోగం చేసినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం జిల్లా సహకార శాఖ అధికారి (డీసీఓ) చంద్రశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడగా.. ఆడిట్ రికార్డులు అడిగినప్పుడల్లా కార్యదర్శి తప్పించుకున్నాడని, ప్రాథమిక విచారణలోనే రూ. 2 కోట్లకు పైగా అవినీతి నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు.
రైతుల కష్టార్జితాన్ని, ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఉపేక్షించేది లేదు. దుర్వినియోగమైన ప్రతి రూపాయిని రికవరీ చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. అవినీతి కార్యదర్శిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, పాత మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ స్కాంలో స్టే పొందిన నిందితులపై స్టే వెకేట్ చేయించి చర్యలు వేగవంతం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సహకార సంఘాలపై నిరంతర పర్యవేక్షణతో పాటు క్రమం తప్పకుండా ఆడిట్లు నిర్వహించాలని ఆయన సూచించారు.
సమావేశంలో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కార్యదర్శి అవినీతికి పాల్పడ్డాడని, ప్రస్తుత కూటమి నాయకులు ఫిర్యాదు చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు.
