
సర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు చేర్చాలి: ఎంపీ అసదుద్దీన్
తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రారంభంకానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో రాష్ట్రంలోని అర్హులైన, నిజమైన ఓటర్లందరి పేర్లను ఈ సవరణ ప్రక్రియలో చేర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ ప్రక్రియ పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఆయన సూచించారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఓవైసీ, భారత పౌరులకు ఉన్న అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు ఓటు హక్కేనని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజల నుంచి ఓటు హక్కును దూరం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడి పేరు, వారు ఏ వర్గానికి చెందిన వారైనా సరే, ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని తమ ప్రయత్నమని చెప్పారు.
తెలంగాణలో 2026 ప్రీ-ప్రింటెడ్ ఫారాలను అందిస్తూ, ఓటర్ల నుంచి 2002 నాటి డేటాను రాయాలని ఆశించడం చాలా కష్టమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. బిఎల్ఓలు మ్యాపింగ్ పూర్తి చేశారని, తన నియోజకవర్గంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారి వద్దకు బూత్ స్థాయి అధికారులు వెళ్తారని చెప్పారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్షాకాలం ప్రారంభమైనందున, నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిగా ముగించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. అందుకే ఈ సవరణ ప్రక్రియ ఎవరినీ మినహాయించేలా కాకుండా, అందరినీ కలుపుపోయేలా ఉండాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదే సందర్భంగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఇంధన సరఫరా అంతరాయాలపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అస్థిరతకు, చమురు గ్యాస్ సంక్షోభానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులే పూర్తిగా బాధ్యులని ఆయన ఆరోపించారు. ప్రపంచ ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ ఇద్దరు నేతలు తమ వినాశకర చర్యలను తక్షణమే ఆపాలని, వారు ప్రారంభించిన ఈ యుద్ధాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధం వల్ల భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
