
ఆగస్టులోపు నల్గొండ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
నగరంలోని నల్గొండ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిని పరిశీలించేందుకు కమిషనర్, చీఫ్ ఇంజనీర్ ఇతర సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బుధవారం ఫ్లైఓవర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఫ్లైఓవర్‌పై బీటీ రోడ్డు నిర్మాణం, సర్వీస్ రోడ్ల పనులు, అక్బర్‌బాగ్ అప్‌ర్యాంప్‌తో పాటు మిగిలిన ర్యాంపుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే క్రాష్ బారియర్ల ఏర్పాటు, రోడ్డు మార్కింగ్‌లు, వీధి దీపాల ఏర్పాటు, ఫ్లైఓవర్ దిగువ భాగంలో ఉద్యానవనం, ల్యాండ్‌స్కేపింగ్ పనులను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
ప్రాజెక్టు మొత్తం పనులను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు వీలైనంత త్వరగా ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, సురక్షితమైన రహదారి సదుపాయాలు కల్పించడం, హైదరాబాద్ ప్రజలకు మెరుగైన అనుసంధానాన్ని అందించడం జీహెచ్‌ఎంసీ లక్ష్యమని అధికారులు తెలిపారు.
