Let's talk: editor@tmv.in
‘నా దేశం–నా బాధ్యత’.. ఖర్చుల నియంత్రణకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

‘నా దేశం–నా బాధ్యత’.. ఖర్చుల నియంత్రణకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Panthagani Anusha
15 మే, 2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం తెలపడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కాబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారధి వివరిస్తూ రాష్ట్ర ప్రగతితో పాటు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశం కోసం పౌరులందరూ మితవ్యయం పాటించాల్సిన అవసరాన్ని వెల్లడించారు.

పరిశ్రమల స్థాపనలో ఏపీని అగ్రపథాన నిలిపేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రూ. 1.08 లక్షల కోట్లతో భారీ 'ఏఐ డేటా సెంటర్' ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా వేల మందికి ఉపాధినివ్వనుంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కర్మాగారం (రూ. 2,508 కోట్లు), అపోలో టైర్స్ విస్తరణ (రూ. 6,100 కోట్లు) గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా రాయలసీమను లక్ష కోట్ల వ్యయంతో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'గా తీర్చిదిద్దేందుకు 'ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్' కు ఆమోదం లభించింది. దీని ద్వారా ఉద్యానవన ఉత్పత్తులను రెట్టింపు చేయడమే కాకుండా రైతులకు మెరుగైన రవాణా మరియు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. అటు ఇంధన రంగంలో కూడా అదానీ గ్రీన్ ఎనర్జీ, రిలయన్స్ మరియు ఇతర సంస్థల ద్వారా గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతులిస్తూ ఏపీని 'క్లీన్ ఎనర్జీ' కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక ప్రజా సంక్షేమం పాలనలో భాగంగా వైద్య రంగంలో '104 డయాగ్నస్టిక్స్' ప్రోగ్రామ్ ద్వారా 41 రకాల ఉచిత పరీక్షలు, 'సంజీవని' డిజిటల్ హెల్త్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి, అదేవిదంగా విశ్వవిద్యాలయాల్లో 1,523 బోధన పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి నియామక పరీక్షల్లో 0.5శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని నిర్ణయించి వారికి పెద్ద పీట వేసింది.

ఇదిలా ఉండగా అంతర్జాతీయ యుద్ధ ఉద్రిక్తతల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 'నా దేశం - నా బాధ్యత' పేరుతో మితవ్యయ చర్యలను ప్రకటించింది. ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు స్వస్తి చెప్పి కాన్వాయ్‌లు తగ్గించుకోవాలని ప్రజలు పెట్రోల్, బంగారం కొనుగోళ్లను తగ్గించి దేశ సంపదను కాపాడాలని పిలుపునిచ్చింది. 'నో వెహికల్ ఫ్రైడే', సోలార్ విద్యుత్ వినియోగం వనరుల సంరక్షణ ద్వారా రాష్ట్రాన్ని స్వావలంబన దిశగా నడిపించాలని కేబినెట్ తీర్మానించింది.