Let's talk: editor@tmv.in
వంద‌ రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
వంద‌ రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

వంద‌ రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
8 జూన్, 2026

నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 పనులను రాబోయే వంద రోజుల్లోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తొలి దశలో గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు ప్రారంభం కాగా, తదుపరి దశ కార్యాచరణను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ. 1,511 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఇందులో భాగంగా ఉప్పల్ భగాయత్ – ఫేజ్ III లో రూ. 98 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్’ నూతన కార్యాలయ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ. 960 కోట్లతో ఏఓసీ సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, రూ. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్‌లో 6 వరుసల ఫ్లైఓవర్, రూ. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే వేదికపై ‘క్యూర్-1’ (కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్) యాప్‌ను కూడా సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గుజరాత్‌లో సబర్మతి, ఢిల్లీలో యమున, యూపీలో గంగానదిని ప్రక్షాళన చేసుకున్నప్పుడు తెలంగాణలో మూసీని ఎందుకు చేయొద్దని ప్రశ్నించారు. మూసీ కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నల్గొండ జిల్లా ప్రజల జీవితాలు దారుణంగా దెబ్బతింటున్నాయన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వల్ల నగర రూపురేఖలు మారడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ ప్రక్రియలో ఏ పేదవాడిని నిరాశ్రయులను చేయబోమని, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసంతో పాటు వారి పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గతంలో మల్కాజిగిరి ప్రాంతంలో సమన్వయం లేని నాలుగు రకాల పరిపాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని సీఎం గుర్తుచేశారు. అందుకే ‘తెలంగాణ విజన్ 2047’ దార్శనికతతో ఓఆర్ఆర్ లోపలి 2100 చ.కి.మీ పరిధిని ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ) ప్రాంతంగా గుర్తించి, పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా, మూడు పోలీస్ జోన్లుగా వికేంద్రీకరించినట్లు ప్రకటించారు.

మెట్రో విస్తరణపై కేంద్ర మంత్రులపై ప్రశ్నలు

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చడానికి అన్ని వైపులా 122 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తామని సీఎం తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను కలుపుతామన్నారు. అయితే, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ ప్రజలు కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డికి ఓట్లు వేయలేదా? మెట్రో అనుమతులు, మూసీకి నిధులు తేవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, మిగిలిన 25 లక్షల టన్నులను కేంద్రంతో కొనుగోలు చేయించే బాధ్యతను కిషన్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సీఎం చర్చకు రాకుండా తప్పించుకు తిరగడానికి కూడా కిషన్ రెడ్డే కారణమన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం మాట్లాడుకుందామని, ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు.

గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయానని, ఇప్పుడు సీఎంగా ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని, నిధులకు కొరత రానివ్వనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కొడంగల్‌లో తనకు రాజకీయ ఎదురుదెబ్బ తగిలినప్పుడు మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి ఆదరించారని గుర్తుచేసుకున్నారు. మల్కాజ్‌గిరి ఒక ‘మినీ భారతదేశం’ అని, ఆడబిడ్డలు ఒక్క పైసా ఆశించకుండా వేసిన ఓట్ల వల్లే తాను ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరానని కృతజ్ఞత చాటుకున్నారు. అలాగే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెడుతున్నామని, చౌరస్తాలో వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తామని సీఎం ప్రకటించారు.