Let's talk: editor@tmv.in
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది: మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
30 జూన్, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర కీలక అంశాలపై సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, మూసీ నదిని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి అని కొనియాడారు. దశాబ్దాలుగా మూసీ కాలుష్యం, వరదలతో పరివాహక ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, పార్కులు, వాక్‌వేల నిర్మాణం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

అభివృద్ధి పేరుతో పేద ప్రజల జీవితాలు దెబ్బతినకుండా, ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని పక్కా మానవీయ కోణంలోనే తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరికీ అన్యాయం జరగనివ్వం. భూసేకరణ ప్రక్రియలో ప్రజా కోణాన్ని, మానవీయ కోణాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని, ఈ ప్రాజెక్ట్ కారణంగా ఇళ్లు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు తగిన కార్యాచరణను రూపొందించి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయే బాధితులకు చట్టబద్ధమైన గరిష్ట పరిహారం, సరైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొని క్షేత్రస్థాయి నివేదికలను మంత్రికి సమర్పించారు.

ట్యాగ్‌లు
MusiRiverMusiRejuvenationHyderabadTelanganaRevanthReddyPonguletiSrinivasaReddyUrbanDevelopmentRiverRestorationInfrastructure
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది: మంత్రి పొంగులేటి - Tholi Paluku