Let's talk: editor@tmv.in
ముర్షీదాబాద్‌.. మహిళ ఓటర్లదే అధిపత్యం

ముర్షీదాబాద్‌.. మహిళ ఓటర్లదే అధిపత్యం

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వలస కార్మికులు ఎక్కువగా ఉన్న శంసేర్‌‌గంజ్, లాల్‌గోలా ప్రాంతాల్లో మహిళలు కుటుంబ బాధ్యతలు చేపట్టడంతో పాటు స్వతంత్రంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు, వలసలు, ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు వంటి సమస్యలు ఇప్పుడు వారికి గుర్తింపు రాజకీయాల కంటే ముఖ్యంగా మారాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో వేలాది మంది పురుషులు కేరళ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. దీంతో మహిళలే ఇళ్లను నడపడం, బ్యాంకు పనులు చూసుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలపై కూడా స్వతంత్రంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌‌) ప్రక్రియలో శంసేర్‌గంజ్‌లో సుమారు 92,000 పేర్లు, లాల్‌గోలా ప్రాంతంలో దాదాపు 69,000 పేర్లు తొలగించినట్లు వార్తలు రావడంతో మహిళల్లో ఆందోళన పెరిగింది. చాలా మంది మహిళలు ఆధార్‌, రేషన్‌, ఓటర్ కార్డులతో బూత్ స్థాయి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

శంసేర్‌గంజ్‌కు చెందిన రేహానా బీబీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికలోనూ తమను హిందువులా, ముస్లింలా అని మాత్రమే అడుగుతారని, కానీ తన భర్త కేరళలో పాత్రలు కడుగుతూ ఎందుకు పని చేయాల్సి వస్తోందో ఎవరూ అడగరని చెప్పారు. ఇంకొక గ్రామానికి చెందిన హసీనా ఖాతూన్ మాట్లాడుతూ మొదట్లో భర్త చెప్పినట్టే ఓటు వేశానని, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. ముంబైలో పని చేస్తున్న తన భర్త సూచనలు ఇచ్చినా, గ్రామంలో సమస్యలను ఎదుర్కొంటున్నది తానే కాబట్టి నిర్ణయం కూడా తానే తీసుకుంటానని ఆమె తెలిపారు.

లాల్‌గోలాకు చెందిన షబ్నం ఖాతూన్ భర్త బెంగళూరులో నిర్మాణ పనుల్లో ఉన్నాడు. గతంలో అతడు చెప్పిన పార్టీకే ఓటు వేసేదానిని, కానీ ఈసారి తనకు సహాయం చేసే అభ్యర్థినే ఎంచుకుంటానని ఆమె చెప్పారు. బూత్ స్థాయి కార్యాలయాల వద్ద ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ స్లిప్‌లతో మహిళల క్యూలు కనిపిస్తున్నాయి. న్యాయ ప్రక్రియ గురించి పూర్తిగా తెలియకపోయినా, పేరు జాబితాలో లేకపోతే తమ గుర్తింపే పోతుందేమో అన్న భయం వారికి ఉందని వారు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార పార్టీ టీఎంసీ మహిళలు, మైనారిటీ ఓటర్లను ఒకే వేదికపైకి తేవాలని చూస్తోంది. ఓటర్ల పేర్లు తొలగించడం ద్వారా పేద ముస్లిం కుటుంబాలను భయపెడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీ మాత్రం అక్రమ చొరబాటు, నకిలీ ఓటర్ల అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ రెండు పార్టీలు భయాలను ఉపయోగించుకుంటున్నాయని, కానీ ముర్షీదాబాద్‌లోని నిరుద్యోగం, వలస సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. ఈసారి ముర్షీదాబాద్‌లో గట్టిగా వినిపించని ఈ నిశ్శబ్ద స్వరం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.