
20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం :మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ( ఎంఎస్ఎంఈ) పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు ఏపీ చిరునామా కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన ‘ఎస్ఎంఈ ఐపీఓ’ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ‘యువగళం’ పాదయాత్రలో ఎదురైన అనుభవాలే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి పునాది వేసాయని మంత్రి వెల్లడించారు. పెనుగొండలో కియా పరిశ్రమ అనుబంధ సంస్థలో పనిచేస్తున్న పద్మావతి అనే మహిళా కార్మికురాలి విజయగాథను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు గృహిణిగా ఉన్న ఆమె పరిశ్రమల రాకతో నెలకు రూ.30 వేలు సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడం తనను ఆలోచింపజేసిందని అదే స్ఫూర్తితో మ్యానిఫెస్టోలో ‘సూపర్ 6’ హామీలలో ఉద్యోగ కల్పనకు అగ్రపీఠం వేశామని తెలిపారు.
పెట్టుబడుల వెల్లువ: 23 నెలల్లో రూ.23 లక్షల కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని లోకేష్ కొనియాడారు. గత 23 నెలల్లోనే దాదాపు 800 ప్రాజెక్టుల ద్వారా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరినట్లు ఆయన ప్రకటించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు రాయలసీమలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు.
అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ఉదాహరణగా చూపుతూ ‘మల్టిప్లయర్ ఎఫెక్ట్’ గురించి మంత్రి వివరించారు. విశాఖలో డేటా సెంటర్ రావడం వల్లే అక్కడ అవసరమయ్యే భారీ కూలింగ్ సిస్టమ్స్ తయారీ కోసం ‘క్యారియర్’ కంపెనీ శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు వాటి చుట్టూ వేలాది ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందుతాయని అందుకే గూగుల్ ఎంత ముఖ్యమో కోటి రూపాయలతో ప్రారంభమయ్యే చిన్న సంస్థ కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
క్లస్టర్ మోడల్ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ
ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘క్లస్టర్ అభివృద్ధి’ ప్రణాళికను రూపొందించిందని రాయలసీమలో ఆటోమొబైల్, అమరావతిలో క్వాంటం టెక్నాలజీ, ఉత్తరాంధ్రలో ఐటీ-ఫార్మా, కోస్తాంధ్రలో ఆక్వా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యమని అనుమతుల ప్రక్రియను ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా సరళీకృతం చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.
ఎన్ఎస్ఈలో లిస్టింగ్ లక్ష్యం: మూడు నెలల్లో 100 కంపెనీలు
చిన్న కంపెనీలు మూలధన మార్కెట్ ద్వారా నిధులను సమీకరించి పెద్ద సంస్థలుగా ఎదగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం మూడు సంస్థలు మాత్రమే ఎన్ఎస్ఈ లో లిస్ట్ కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 ఎంఎస్ఎంఈలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.
