Let's talk: editor@tmv.in
రేపు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్

రేపు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్

Panthagani Anusha
24 మే, 2026

రాష్ట్రంలో ప్రతి ఇంటా ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత ఆశయానికి అనుగుణంగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం పనిచేస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ (సోమవారం) విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న "ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్" ఏర్పాట్లను శనివారం మంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ఈ గ్రోత్ సమ్మిట్ ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుందని, దీనిని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

సదస్సుకు హాజరయ్యే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఏ విధంగా సమీకరించాలి వారికి ప్రభుత్వ పథకాలపై ఎలా అవగాహన కల్పించాలి కొత్త అవకాశాల వైపు వారిని ఎలా నడిపించాలి అనే అంశాలపై అధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు. సదస్సు నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ సమయపాలన పాటించాలని నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ప్రతినిధుల వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని పోలీస్ మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. సదస్సుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, ఏపీఐఐసీ వీసీ, ఎండీ దినేష్ కుమార్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ, విజయవాడ ఆర్డీవో, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, పోలీసు శాఖ తరపున ఏడీసీపీ మురళీకృష్ణ, డీఎస్పీ మానస, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.