Let's talk: editor@tmv.in
ఆలూరు నుంచి అగ్రి ల్యాబ్ తరలింపు సమంజసం కాదు: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

ఆలూరు నుంచి అగ్రి ల్యాబ్ తరలింపు సమంజసం కాదు: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

Gaddamidi Naveen
11 జూన్, 2026

ఆలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌ను ఆధోనికి తరలించే నిర్ణయం సమంజసం కాదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలూరు మార్కెట్ యార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సేవలు అందించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి కేటాయించిన అగ్రి ల్యాబ్ భవనాన్ని రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించి, 2021 జూలై 8న ప్రారంభించారని చెప్పారు.

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఆలూరు ఒకటని, ఇక్కడి రైతులు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నేరుగా ఉపయోగపడే అగ్రి ల్యాబ్‌ను ఆలూరు నుంచి ఆధోనికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

అగ్రి ల్యాబ్‌ను ఎందుకు తరలిస్తున్నారో ప్రజలకు, రైతులకు ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలూరు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని, ల్యాబ్‌ను యథాస్థానంలో కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే నియోజకవర్గ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.