Let's talk: editor@tmv.in
మీ సేవ వాట్సాప్ చానల్‌లో మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

మీ సేవ వాట్సాప్ చానల్‌లో మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

Gaddamidi Naveen
20 మే, 2026

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో, రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకు 'మీ సేవ' తన డిజిటల్ పరిధిని మరింత విస్తరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన మీ సేవ, గతేడాది (18 నవంబర్ 2025) ప్రారంభించిన తన 'మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్' చానల్ ద్వారా ఇప్పటికే అనేక సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని పలు కీలకమైన పౌర సేవలను కూడా ఈ వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం ప్రకటించింది. దీనివల్ల హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ నుండే నేరుగా వాట్సాప్ ద్వారా ఈ సేవలను తక్షణమే పొందవచ్చు.

కొత్తగా చేరిన జీహెచ్‌ఎంసీ సేవలు ఇవే..

• జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను అంచనా సవరణ

• జనన ధృవీకరణ పత్రంలో సవరణలు

• మరణ ధృవీకరణ పత్రంలో సవరణలు

• ఇంట్లో జరిగిన జనన నమోదు,

• ఇంట్లో మరణించిన మరణ నమోదు

• ఆస్తి పత్రాలలో డోర్ నంబర్ సవరణ

• ఆస్తి పత్రాలలో పేరు మార్పు/సవరణ

• జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను సేవలు

• ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్

వాట్సాప్ ద్వారా ఈ సేవలను పొందే విధానం

ఈ సేవలను పొందే విధానం చాలా సులభం అని అధికారులు తెలిపారు.

1:

మొదటగా మీ మొబైల్‌లో మీ సేవ అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096 ను సేవ్ చేసుకోవాలి.

2:

వాట్సాప్ ఓపెన్ చేసి, సదరు నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా చాట్‌బాట్‌ను ప్రారంభించాలి.

3:

ఆ తర్వాత మీకు కావలసిన సేవ పేరును టైప్ చేయాలి (ఉదాహరణకు: జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను అంచనా సవరణ లేదా జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను సేవలు).

4:

మెనూలో కనిపించే ఓపెన్ స‌ర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5:

చాట్‌బాట్ అడిగిన విధంగా మీ వివరాలను ఫారమ్‌లో నమోదు చేయాలి.

6:

చివరగా సదరు సేవకు నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. పేమెంట్ విజయవంతం కాగానే మీ దరఖాస్తు వాట్సాప్ ద్వారా తక్షణమే సమర్పించబడుతుంది.

2025 నవంబర్ 18న ప్రారంభమైన నాటి నుంచి, ఈ మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ ప్లాట్‌ఫారమ్‌కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ఆదరించిన డిజిటల్ పబ్లిక్ సర్వీస్ చానల్‌గా ఇది గుర్తింపు పొందింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రస్తుతం బర్త్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ (ఆదాయ) సర్టిఫికేట్, పోలీస్ చలాన్ చెల్లింపులు, కరెంట్ బిల్లుల చెల్లింపులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రోజువారీ పాలన, అత్యవసర సేవల కోసం ప్రజలు వాట్సాప్‌పై చూపిస్తున్న నమ్మకానికి ఇది నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.