

పీఎంజీఎస్‌వై పనులకు మరిన్ని నిధులు ఇవ్వాలి: మంత్రి సీతక్క
ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని రహదారి పనులను మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి, గిరిజన మారుమూల ప్రాంతాల్లో రోడ్డు అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్‌వై ప్రాంతీయ సమావేశంలో ఆమె పాల్గొని రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్, ఎన్‌ఆర్‌ఐడీఏ డైరెక్టర్ జనరల్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా పీఎంజీఎస్‌వై పథకం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, వైద్య, ఉపాధి రంగాల అభివృద్ధికి ఎంతో దోహదపడిందన్నారు. అయితే, గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను భరించేదని, కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం వేస్తోందని గుర్తుచేశారు. ఈ విధానాన్ని పునఃసమీక్షించి, గతంలో మాదిరిగానే పూర్తి నిధులను కేంద్రమే భరించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక సడలింపులు అవసరమని స్పష్టం చేశారు.
అభివృద్ధికి అడ్డంగా మారిన అటవీ చట్టాలు
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి గిరిజన జిల్లాల్లో అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాల కారణంగా రోడ్డు పనుల అనుమతులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల అభివృద్ధి, గ్రామీణ రవాణా సౌకర్యాల దృష్ట్యా ఈ నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కోరారు. దెబ్బతిన్న పాత రహదారులు, కల్వర్టుల పునర్నిర్మాణానికి (అప్‌గ్రేడేషన్) కూడా అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయని, వీటికి సులభంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటవీ చట్టాల్లో ఈ మధ్య తెచ్చిన మార్పులు ఆదివాసీల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్'ను అమలు చేస్తోందని, నాణ్యత కోసం ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని మంత్రి తెలిపారు. రాబోయే పీఎంజీఎస్‌వై-4 కింద మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు అనుసంధానంగా తెలంగాణకు మరిన్ని కొత్త రోడ్లను మంజూరు చేయాలని కోరారు.
కేంద్ర ప్రతినిధుల సానుకూల స్పందన
మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన నిధులు, అటవీ చట్టాల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అటవీ నిబంధనల వల్ల ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో చర్చించి, ప్రత్యేక అనుమతుల మంజూరు ద్వారా పనుల వేగవంతానికి తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
