
మనీలాండరింగ్ కేసు: అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తాను 'అప్రూవర్' (ప్రభుత్వ సాక్షి)గా మారతానంటూ ఆమె ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు శుక్రవారం ఆదేశించింది. ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.
సుకేశ్ మోసాల వల.. చిక్కుల్లో జాక్వెలిన్
అతిపెద్ద ఆర్థిక నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్, తాను ఒక పెద్ద వ్యాపారవేత్తనని నమ్మించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పరిచయం పెంచుకున్నాడు. జైలు నుంచే ఆమెతో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతూ.. ఆమెను ఆకట్టుకోవడానికి అప్రూవల్ లేని మార్గాల్లో సంపాదించిన కోట్లాది రూపాయలతో లగ్జరీ కార్లు, ఖరీదైన నగలు, డిజైనర్ బ్యాగులను బహుమతులుగా పంపించాడు. ఈ నగదు అంతా మోసాల ద్వారా వచ్చిందని (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) తెలిసినప్పటికీ ఆమె ఆ కానుకలు స్వీకరించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించడంతో, ఈ మనీలాండరింగ్ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా చేర్చారు.
విచారణ నుంచి అప్రూవర్ వైపు..
సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో జాక్వెలిన్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. తొలుత ఆమెను సాక్షిగా భావించినప్పటికీ, విచారణ క్రమంలో సేకరించిన ఆధారాల మేరకు ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో ఆమె పేరును నిందితురాలిగా చేర్చారు. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని (క్వాష్) కోరుతూ గత ఏడాది జూలై 3న ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో జాక్వెలిన్‌కు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె అప్రూవర్‌గా మారి నిజాలు వెల్లడించేందుకు సిద్ధమవ్వడం గమనార్హం.
అసలేమిటీ కేసు?
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్‌ల భార్యల నుంచి రూ.200 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు సుకేశ్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేరపూరిత సొమ్మును చేరవేయడానికి సుకేశ్ తన భార్య లీనా పౌలోస్‌తో కలిసి హవాలా మార్గాలను, షెల్ కంపెనీలను ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, సుకేశ్ దంపతులపై కఠినమైన 'మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్' (మకోకా)ను ప్రయోగించారు. సుకేశ్‌పై కేవలం ఈ కేసే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని విచారణలు కొనసాగుతున్నాయి.
జాక్వెలిన్ విన్నపాన్ని కోర్టు మన్నించి, ఆమె అప్రూవర్‌గా మారితే.. ఈ కేసులో సుకేశ్‌కు వ్యతిరేకంగా మరింత బలమైన సాక్ష్యాధారాలు లభించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నా రు. ఏప్రిల్ 20న ఈడీ సమర్పించబోయే సమాధానంపైనే జాక్వెలిన్ భవితవ్యం ఆధారపడి ఉంది.
