
మోడీ ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారు: ఖర్గే
మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమిపై విమర్శలు చేస్తూ మొదట మోడీని ‘టెర్రరిస్ట్’గా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. అయితే వెంటనే వివరణ ఇస్తూ, తాను మోడీని ప్రత్యక్ష అర్థంలో టెర్రరిస్ట్ అని అనలేదని, ఆయన చర్యలు ప్రజలను, ప్రతిపక్షాలను ‘టెర్రరైజ్’ చేస్తున్నాయని భావంలో మాత్రమే ఆ వ్యాఖ్య చేశానని తెలిపారు.
కూటమిపై ప్రశ్నలు
ద్రావిడియన్ సిద్ధాంతాలను అనుసరించిన సి ఎన్ అన్నాదురై, పెరియార్ ఈవీ రామస్వామి వారసత్వాన్ని కలిగిన ఏఐఏడీఎంకే ఎలా బీజేపీతో చేతులు కలుపుతుందో అర్థం కావడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థలను రాజకీయంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కొన్ని పార్టీలపై దాడులు జరగడం అనుమానాస్పదమని అన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం, ఎన్నికల సంఘం స్వతంత్రతపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
డీఎంకే–కాంగ్రెస్ బంధం
ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో కలిసి మాట్లాడుతూ డీఎంకే–కాంగ్రెస్ కూటమి బలంగా ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఖండించారు. ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారని పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ను కలపడం ప్రమాదకరం
మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం ద్వారా బీజేపీ ప్రమాదకర ఆట ఆడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాచేరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో ఓడిపోవడాన్ని స్వాగతించారు. ఈ బిల్లును 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం వల్ల జనాభా నియంత్రణలో విజయవంతమైన తమిళనాడు వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
కాంగ్రెస్ ముందుండి పోరాడింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించకుండా ముందుకెళ్లిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ఐక్యంగా నిలవడంతో బిల్లు ఓడిపోయిందని, ఇందులో కాంగ్రెస్ ముందుండి పోరాడిందని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మొదటగా గళమెత్తారని ఖర్గే పేర్కొన్నారు. ఇది ప్రజా వ్యతిరేకం, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేసే చర్యగా ఆయన అభివర్ణించారని గుర్తు చేశారు. మహిళలకు పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం కాంగ్రెస్ సాధించిన విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోడీ కృషి కాదని గుర్తు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను దేశంపై చేసిన మోసంగా అభివర్ణిస్తూ, 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ కేంద్రం దానిని అమలు చేయకుండా 30 నెలలు ఆలస్యం చేసిందని ఆరోపించారు. ఈ విషయంపై తాను పలుమార్లు ప్రధానికి లేఖలు రాసినా స్పందన రాలేదని తెలిపారు.
ఏఐఏడీఎంకే పై విమర్శలు
అలాగే ఏఐఏడీఎంకేపై కూడా ఖర్గే విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బీజేపీకి ‘నిశ్శబ్ద భాగస్వామి’గా మారిపోయిందని, తమిళనాడు ప్రయోజనాలను కాపాడలేకపోతుందని అన్నారు. కేంద్రం తమిళనాడుకు రావాల్సిన నిధులు, పన్ను వాటాను నిలిపివేస్తోందని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకున్నారని మాజీ గవర్నర్‌పై కూడా విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేతో పోటీ జరుగుతోంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
