Let's talk: editor@tmv.in
మోడీ దేశభక్తుడు కాదు.. దేశద్రోహి: రాహుల్‌గాంధీ

మోడీ దేశభక్తుడు కాదు.. దేశద్రోహి: రాహుల్‌గాంధీ

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడు కాదని, దేశద్రోహి అని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాయ్‌గంజ్‌, మాల్దా ప్రాంతాల్లో జరిగిన సభల్లో మాట్లాడిన ఆయన, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషపూరిత రాజకీయాలతో దేశ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం రాష్ట్రంలో 84 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని బలహీన పరుస్తున్నాయి

బీజేపీ, ఆర్‌‌ఎస్‌ఎస్‌ సంస్థలపై దాడి చేస్తూ, రాజ్యాంగాన్ని బలహీనపరచే విధంగా అవి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్‌‌) రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విభజించి ఎన్నికల్లో లాభం పొందాలనే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక సవరణ ప్రక్రియలో తప్పుగా తొలగించిన ఓటర్ల పేర్లను మళ్లీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని అన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడటానికి తృణమూల్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ బెంగాల్‌లో పరిశ్రమలు మూసివేసి సిండికేట్ల ద్వారా ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్‌కు రావాల్సిన రూ.2 లక్షల కోట్ల నిధులను ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూడా నిలిపివేసిందని అన్నారు. శారదా, రోజ్‌ వ్యాలీ వంటి చిట్‌ఫండ్ కుంభకోణాలను ప్రస్తావిస్తూ తృణమూల్ నేతలతో సంబంధం ఉన్న సిండికేట్లు అవినీతి ద్వారా లాభపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ హింస కూడా పెరిగిందని ఆయన విమర్శించారు.

మోడీ అమెరికాకు లొంగిపోయారు

అమెరికాతో భారతదేశం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ ఒప్పందం వల్ల దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతింటాయని, ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. అమెరికా ఉత్పత్తులు భారత మార్కెట్లో భారీగా ప్రవేశిస్తే దేశీయ పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. అమెరికా వస్తువులను రూ.9.5 లక్షల కోట్ల విలువకు కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించిందని ఆయన ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వద్ద ఎఫ్‌స్టీన్ కేసుకు సంబంధించిన 35 లక్షల పత్రాలు ఉన్నాయని, అవి ఇంకా బయటకు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అమెరికా ఒత్తిడికి లోనయ్యారని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కూడా అమెరికాకు అనుకూలంగా తెరిచారని, దీని వల్ల భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. మోడీ దేశభక్తుడు కాదు, దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ డేటా భద్రతను కూడా అమెరికాకు అప్పగించినట్లు ఆరోపిస్తూ, దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆయన అన్నారు. అమెరికా వస్తువులు సునామీలా భారత మార్కెట్లోకి వస్తే దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని, ఇప్పటికే పరిశ్రమలు తగ్గుతున్న బెంగాల్‌కు ఇది మరో నష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.