
వలస కార్మికుల పిల్లలకు మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం: మంత్రి సీతక్క
రాష్ట్రంలోని ఏ ఒక్క చిన్నారి కూడా అంగన్‌వాడీ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్‌వాడీ వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో సేవలు అందించనుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చిన్నారులే దేశ సంపద, దేశ భవిష్యత్తని పేర్కొన్నారు. తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఇప్పటివరకు సాధారణ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి–శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవని తెలిపారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే పిల్లలు, ముఖ్యంగా ఉపాధి కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యకు పరిష్కారంగా మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి వివరించారు. సాధారణ అంగన్‌వాడీ కేంద్రాల్లో లభించే అన్ని సేవలు మొబైల్ అంగన్‌వాడీ వాహనాల్లో కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలకు ఈ వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయని తెలిపారు. ఒక్కో మొబైల్ అంగన్‌వాడీ వాహనం దాదాపు పది అంగన్‌వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఒక్కో కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రజలు ఉన్న ప్రాంతానికే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
చిన్నారి చిరునవ్వే నిజమైన అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి, స్వాతంత్ర్యోద్యమ కాలంలో గ్రామాలకు విజ్ఞానం చేర్చిన చైతన్య రథాల మాదిరిగా ఈ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రతి చిన్నారికి పోషకాహారం, ఆరోగ్యం, విద్యను చేరవేసి ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి చిన్నారి సమగ్ర అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
