Let's talk: editor@tmv.in
జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధర్నా
జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధర్నా

జలమండలి కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధర్నా

Gaddamidi Naveen
19 మే, 2026

నగర ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ఆరోపించారు. రంగారెడ్డి నగర్ డివిజన్, ఆదర్శ్ నగర్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ కాలనీలు, బస్తీలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వాసులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అనుభవ రాహిత్యం కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల తాగునీటి సరఫరా హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో దాదాపు రూ.2000 కోట్ల నిధులతో పైప్‌లైన్‌లు నిర్మించి నగరానికి తాగునీటి సరఫరా మెరుగుపరిచినట్లు గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా పాలన చేస్తోందని విమర్శించారు.

కాలనీలు, బస్తీలలో పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మురుగు నీరు రోడ్లపైకి రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధి విస్తరణతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వెలుపల గ్రామాలను కలిపినా, వాటికి సరిపడ నిధులు కేటాయించలేదని అన్నారు.

హెచ్ఎండబ్ల్యూఎస్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కూడా తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ఇంటింటికీ నీటి సరఫరా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మళ్లీ పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి 24 గంటల తాగునీటి సరఫరా హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరింత తీవ్రంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసం ముట్టడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.