Let's talk: editor@tmv.in
రైతుల రాస్తారోకోకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు

రైతుల రాస్తారోకోకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు

Gaddamidi Naveen
6 మే, 2026

సిద్దిపేట జిల్లా ఆల్వాల ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. పామాయిల్ పంట సాగుపై ఆల్వాల జయ విజయ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు ధర్నా చేస్తేనే వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచిది కాదన్నారు. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, సరైన ప్రణాళికతో ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఎంత మేరకు పంట సాగు జరుగుతోంది, ఎంత దిగుబడి వస్తోంది, దానికి అనుగుణంగా గోదాములు, రవాణా సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయా అనే అంశాలపై సమీక్ష జరగడం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వడ్లకు అవసరమైన తూర్పార మిషిన్లు అందుబాటులో లేకపోవడం, జల్లి పట్టిన వడ్లను కూడా బీ గ్రేడ్‌గా కొనుగోలు చేయడం సరైంది కాదని ప్రశ్నించారు.

మక్కల కొనుగోలుకు గన్నీ బ్యాగులు లేక రైతులే సంచులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. నెలరోజులుగా పత్తి, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడం దారుణమన్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రభుత్వానికి విక్రయించడం రైతులకు మరింత కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, రైతుల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేపడతామని హెచ్చరించారు.