Let's talk: editor@tmv.in
గుంటూరులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

Gaddamidi Naveen
15 జూన్, 2026

గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఆదివారం గుంటూరు 19వ డివిజన్‌లో ఆమె ఆధ్వర్యంలో, శ్రీ భ్రమర ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి అందుతున్న సేవల వివరాలను సేకరించారు.

ఈ వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు ఉచిత వైద్య సేవలను పొందారు. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. మొత్తం 250 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈసీజీ పరీక్షలలో కొందరికి గుండె సంబంధిత సమస్యలు గుర్తించబడగా, వారికి తక్షణ చికిత్స కోసం ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. డయాబెటిస్, రక్తపోటు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు అందించారు. వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న కొందరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి రావాలని సూచించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 72 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుండె రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎల్‌ఓసీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములవుతున్న వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యానికి, వైద్య బృందానికి, శ్రీ భ్రమర ట్రస్ట్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.