Let's talk: editor@tmv.in
అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం

అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం

Gaddamidi Naveen
14 మే, 2026

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్తగా వేసిన రోడ్లు రెండు నెలలకే ధ్వంసమవుతుండటంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారీ లోడ్‌తో, నీరు కారుస్తూ వెళ్తున్న ఇసుక లారీల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆమె మండిపడ్డారు.

మంగళవారం రాత్రి టీడీపీ నేత బెల్లంకొండ సురేష్ మృతి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి వస్తున్న సమయంలో పట్టాభిపురం బ్రిడ్జి వద్ద పరిస్థితిని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ 70 టన్నులకు పైగా భారీ లోడ్‌తో, నీరు కారుస్తూ వెళ్తున్న ఇసుక లారీలను చూసి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాహనాల వల్ల కొత్తగా నిర్మించిన రోడ్లు త్వరగా పాడవడమే కాకుండా ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు.

భారీ లోడ్ కారణంగా రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యేకించి పట్టాభిపురం బ్రిడ్జి ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని ఆమె హెచ్చరించారు. నీరు కారుస్తూ వెళ్లే లారీల వల్ల ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.

గతంలోనే హెవీ లోడ్ లారీల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఓవర్‌లోడ్ వాహనాలు యథేచ్ఛగా నగరంలో తిరుగుతుండటం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రోడ్ల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆమె హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకుని ఓవర్‌లోడ్ లారీలపై కఠిన నియంత్రణ అమలు చేయాలని అధికారులను ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆదేశించారు.