Let's talk: editor@tmv.in
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎం.కె. స్టాలిన్ రాజీనామా

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎం.కె. స్టాలిన్ రాజీనామా

Gaddamidi Naveen
6 మే, 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఓటమి చవిచూడటంతో ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించారు. లోక్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాని దెబ్బతీస్తూ నూతన శకం ప్రారంభమైన నేపథ్యంలో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

డీఎంకేకు భారీ దెబ్బ

ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 107 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ మార్కు (118)కు కేవలం 11 సీట్ల దూరంలో నిలిచింది. మరోవైపు, అధికారంలో ఉన్న డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే టీవీకే 32 శాతానికి పైగా ఓట్లు సాధించగా, డీఎంకే 24.19 శాతం, ఏఐఏడీఎంకే 21.22 శాతానికి పడిపోయాయి.

సొంత నియోజకవర్గంలోనే స్టాలిన్ ఓటమి

డీఎంకేకు ఈ ఎన్నికల్లో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొళత్తూర్‌లో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓటమి అనంతరం స్టాలిన్ స్పందిస్తూ, తమ కూటమికి ఓటు వేసిన 1.54 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన పార్టీకి, తమకు మధ్య ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమే ఉందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ముందున్న రాజకీయ సమీకరణలు

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డీఎంకే కూటమిలోని కీలక నేతలు బుధవారం స్టాలిన్‌తో భేటీ కానున్నారు. వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ తదితరులు డీఎంకే ప్రధాన కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం టీవీకే ఇతర పార్టీలతో పొత్తులపై సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు తమిళనాడులో సరికొత్త రాజకీయ ప్రయోగానికి నాంది పలికాయి. దశాబ్దాల కాలం తర్వాత ఒక సినీ నేపథ్యం ఉన్న నాయకుడు నేరుగా అధికార పీఠానికి చేరువ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎం.కె. స్టాలిన్ రాజీనామా - Tholi Paluku